Thursday, June 12, 2014

చదివితి దొల్లి కొంత చదివేనింకా గొంత


చదివితి దొల్లి కొంత చదివేనింకా గొంత
యెదిరి నన్నెఱగను యెంతైన నయ్యో

వొరుల దూషింతుగాని వొకమారైన నా
దురిత కర్మములను దూషించను
పరుల నవ్వుదుగాని పలుయోనికూపముల
నరకపు నా మేను నవ్వుకోను

లోకుల గోపింతు గాని లోని కామాదులనేటి
కాకరి శత్రువుల మీద కడు కోపించ
ఆకడ బుద్దులు చెప్పి అన్యుల బోధింతుగాని
తేకువ నాలోని హరి దెలుసుకోలేను

యితరుల దుర్గుణము లెంచి,యెంచి రోతుగాని
మతిలో నాయాసలు మానలేను
గతిగా శ్రీవేంకటేశుగని బ్రతికిగాని
తతి నిన్నాళ్ళ దాకా దలపోయలేను

No comments:

Post a Comment