దేవ నీ పక్షపాతమో తిరిగే లోకుల వెల్తో
శ్రీవిభుడ నీవేకాదా చిత్తములోనయ్యా
దివములు సరియే దినరాత్రులును సరే
యివల సుఖదుఃఖాలు హెచ్చుకుందులేలయ్యా
భవములు సరియే ప్రాణములు సరియే
భువి పుణ్యపాపముల భోగము వేరేలయ్యా
విని కిందిరి కొకటే విషయాలు నొకరీతే
మునిగేటిజాతిబేధము లివేలయ్యా
అనయముఁ జూపొక్కటే ఆకలియు నొకటే
పెనగేటి గుణములు పెక్కుజాడ లేలయ్యా
అంతరాత్మ నీవొక్కడ వన్నిటా శ్రీవేంకటేశ
చింతలు వేవేలైన సిలుగేలయ్యా
యింతసేసీ నీమాయ లిందుకే నీశరణంటే
కాంతుడ నన్నిందుకే కాచితివి నేడయ్యా
No comments:
Post a Comment