దేవుడవు నీవు దేవుల నేను
వావులు గూడగాను వడి సేస వెట్టితి
వలపులు నే నెఱగ వాసులెఱగను - నీవు
కలకల నవ్వితేనే కరగితిని
పలుకులు నే నేర భావించగ నే నేర
పిలిచి విడెమిచ్చితే ప్రియమందితిని
మనసు సాధించనోప మర్మము లడుగనోప
చెనకి గోర నూదితే చేకొంటిని
పెనగజాలను నేను బిగియగ జాలను
కనువిచ్చి చూచితేనే కానిమ్మంటిని
పచ్చిచేతలు రచించ బలుమారు సిగ్గువడ
మచ్చిక గాగిలించితే మరిగితిని
యిచ్చట శ్రీవెంకటేశ యేలుకొంటి విటు నన్ను
మెచ్చి కాగిలించితేను మేకొని మొక్కితిని
No comments:
Post a Comment