Thursday, June 12, 2014

దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో ఉబ్బు నీటిపై నొక హంస


దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో  
ఉబ్బు నీటిపై నొక హంస


అనువున గమల విహారమె నెలవై  

ఒనరియున్న దిదె ఒక హంస
మనియెడి జీవుల మానస సరసుల  

వునికి నున్న దిదె ఒక హంస


పాలు నీరు నేర్పరచి పాలలో  

నోలలాడె నిదె యొక హంస
పాలుపడిన యీ పరమహంసముల  

ఓలి నున్న దిదె యొక హంస


తడవి రోమరంధ్రంబుల గ్రుడ్ల  

నుడుగక పొదిగీ నొక హంస
కడు వేడుక వేంకటగిరి మీదట  

నొడలు పెంచెనిదె యొక హంస

దృష్టితాకు మాఅయ్యకు తెరవేయరే


దృష్టితాకు మాఅయ్యకు తెరవేయరే
దృష్టించెదరెవరైనా దరిచేరనీయకురే


చప్పుడు సేయుటకవసరము కాదనరే
అప్పుడు మజ్జనము ఆడుననీ తెలుపరే
కప్పురంపు సురటుల కొలిచెదరనరే
అప్పుడు సతుల తోనూ ఆరగించినాడనరే


దంతపు చవికెలో ఏకాంతమాదేననరే
అంతరంగమున నృత్యము ఆడెదరని తెలుపరే
దొంతి పూలతోటలోన తమిగూడి యున్నాడనరే
చెంత కేళాకూళి లోన చిత్తగించి యున్నాడనరే




పట్టంపు రాణియు తాను పవ్వళించియున్నాడనరే
రట్టుసేయనిందెవరైనా రానీయకురే
పట్టపు అలమేలుమంగపతి శ్రీవేంకటేశ్వరుడు
సృష్టిలోకకర్త గాన సేవించి పొమ్మనరే

దేవ యీ తగవు దీర్చవయ్యా


దేవ యీ తగవు దీర్చవయ్యా 
వేవేలకు నిది విన్నపమయ్యా


తనువున బొడమినతతి నింద్రియములు 
పొనిగి యెక్కడికి బోవునయా
పెనగి తల్లికడ బిడ్డలు భువిలో 
యెనగొని యెక్కడి కేగుదురయ్యా


పొడుగుచు మనమున బొడమిన యాసలు 
అదన నెక్కడికి నరుగునయా
వొదుగుచు జలములనుండు మత్స్యములు 
పదపడి యేగతి బాసీనయ్యా


లలి నొకటొకటికి లంకెలు నివే 
అలరుచు నేమని యందునయా
బలు శ్రీవేంకటపతి నాయాత్మను 
గలిగితి వెక్కడి కలుషములయ్యా

దేవదేవోత్తమ తే నమో నమో


దేవదేవోత్తమ తే నమో నమో
రావణదమన శ్రీరఘురామ


రవికులాంబుధిసోమ రామలక్ష్మణాగ్రజ
భువి భరత శతృఘ్న పూర్వజ
సవన పాలక కౌసల్యానంద వర్ధన
ధవళాబ్జనయన సీతారమణా


దనుజ సంహారక దశరథ నందన
జనక భూపాలక జామాత
వినమిత సుగ్రీవ విభీషణ సమేత
మునిజన వినుత సుముఖ చరిత్ర


అనిలజ వరద అహల్యశాప మోచన
సనకాది సేవిత చరణాంబుజ
ఘనతర వేంకట శ్రీగిరి నివాస
అనుపమోదార విహార గంభీర

దేవ వాసుదేవ భావయ తాం పాలయ


దేవ వాసుదేవ
భావయ తాం పాలయ


నరహరే అహో నారాయణరే
మురహర నగధర ముకుంద
తరుణీయం తు తవ విరహేణ
భరితవిచిత్రప్రతిమా జాతా


దివిజవందిత దేవోత్తమ అహో
నవనీతప్రియ నందసుత
తవ సంగమసంతతకామనయా
యువతి ర్జాతా యోగిణీవ


జిత(తి)దానవ అహో శ్రీవేంకటపతే
సతత మాధవ కృష్ణ సర్వేశ
రతిసంగమేన రమణీ యంతు
బతతే విహితాభరణా జాతా

దేవదుందుభులతోడ తేటతెల్లమైనాడు


దేవదుందుభులతోడ తేటతెల్లమైనాడు
సేవించరో ఇదే వీడే సింగారదేవుడు


బంగారుమేడలలోన పన్నీటమజ్జనమాడి
అంగము తడి యొత్తగా అదే దేవుడూ
ముంగిట( బులుకడిగిన ముత్యమువలె నున్నాడు
కుంగని రాజసముతో కొండవంటి దేవుదూ


కాంతులుమించిన మాణికపు తోరణముకింద
అంతటా కప్పురము చాతుకదే దేవుడు
పొంతల నమృతమే పోగైనట్టున్నవాడు
సంతతము సంపదల సరిలేని దేవుడు


తట్టుపుణుగు నించుక దండిసొమ్ములెల్లాబెట్టి
అట్టేలమేల్మంగ నరుత(గట్టి
నెట్టన నమ్మినవారికి ధానమైనున్నవాడు
పట్టపు శ్రీవేంకటాద్రి పతియైన దేవుడు

దీనరక్షకుడఖిలవినుతుడు దేవ దేవుడు రాముడు


దీనరక్షకుడఖిలవినుతుడు దేవ దేవుడు రాముడు
జానకీపతి కొలువుడీ ఘన సమర విజయుడు రాముడు


హరుని తారక బ్రహ్మమంత్రమై యమరినయర్థము రాముడు
సురలగాచి యసురుల నడచిన సూర్యకులజుడు రాముడు
సరయువం(నం)దును ముక్తి చూరలు జనుల కొసగెను రాముడు
హరియె యాతడు హరి విరించుల కాదిపురుషుడు రాముడు


మునులరుషులకు నభయ మొసగిన మూలమూరితి రాముడు
మనసులోపల పరమయోగులు మరుగు తేజము రాముడు
పనిచి మీదటి బ్రహ్మ పట్టము బంటు కొసగెను రాముడు
మనుజవేషముతోడ నగజకు మంత్రమాయను రాముడు


బలిమి మించిన దైవికముతో భక్త సులభుడు రాముడు
నిలిచి తనసరిలేని వేలుపు నిగమవంద్యుడు రాముడు
మెలుపు శ్రీ వేంకటగిరీంద్రముమీది దేవుడు రాముడు
వెలసె వావిలిపాటిలోపలి వీర విజయుడు రాముడు

దేహినిత్యుడు దేహము లనిత్యాలు


దేహినిత్యుడు దేహము లనిత్యాలు
యిహల నా మనసా యిది మరువకుమీ


గిది బాతచీరమాని కొత్త చీరగట్టినట్టు
ముదిమేను మాని దేహముమొగి గొత్తమేను మోచు
అదన జంపగలేవు ఆయుధము లితని
గదసి యగ్నియు నీరు గాలి జంపగ లేవు


ఈతడు నరకు వడ డీతడగ్ని గాలడు
యీతడు నీటమునుగ డీతడు గాలిబోడు
చేతనుడై సర్వగతుండౌ చెలియించ డేమిటను
యీతల ననాది యీ తడిరవు గదలడు


చేరికాని రాని వాడు చింతించరాని వాడు
భారపువికారాల బాసిన వాడీ యాత్మ
అరయు శ్రీవేంకటేశు ఆధీన మీతడని
సారము తెలియుటే సత్యం జ్ఞానం

దైవంబవు కర్తవు నీవే హరి


దైవంబవు కర్తవు నీవే హరి
యీవల నావల నెవ్వడనయ్యా


తలచిన తలపులు దైవ యోగములు
కలిగిన చేతలు కర్మములు
వెలసిన దేహము విషయాధీనము
యిల నౌకాదన నెవ్వడనయ్యా


జిగి నింద్రియములు చిత్తపు మూలము
తగులమి మాయకు తను గుణము
జగతి ప్రాణములు సంసార బంధము
యెగదిగ నాడగ యెవ్వడనయ్యా


శ్రీ తరుణేశ్వర శ్రీవేంకటపతి
ఆతుమ యిది నీ అధీనము
యీతల నీవిక నెట్టైన జేయుము
యేతలపోతకు నెవ్వడనయ్యా

దేవదేవోత్తమ నాకుదిక్కు నీవే యెపుడును


దేవదేవోత్తమ నాకుదిక్కు నీవే యెపుడును
యేవివరము తెలియ నేమిసేతునయ్యా


పాపముడిగినగాని ఫలియించదు పుణ్యము
కోపముమానినగాని కూడదు శాంతి
చాపల మడచక నిశ్చలబుద్ధి గలుగదు
యేపున నా వసము గా దేమి సేతునయ్యా


ఆసవిడిచిన గాని యంకెకురాదు విరతి
రోసినగాని సుజ్ఞానరుచి పుట్టదు
వేసాలు దొలగించక వివేకా లెల్లా మెచ్చరు
యీసుద్దు లేమియు నేర నేమి సేతు నయ్యా


కల్లలాడకున్నగాని కడతేరదు సత్యము
వొల్ల నన్నగాని సుఖ మొనగూడదు
యిల్లిదె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
యెల్లకాల మీమేలున కేమి సేతు నయ్యా

దిక్కునీవే జీవులకు దేవ సింహమా


దిక్కునీవే జీవులకు దేవ సింహమా
తెక్కుల గద్దియమీది దేవసింహమా


సురలెల్లా గొలువగ సూర్యచంద్రులకన్నుల
తిరమైన మహిమల దేవసింహమా
నిరతి ప్రహ్లాదుడు నీయెదుట నిలిచితే
తెరదీసితి మాయకు దేవసింహమా


భుజములుప్పొంగగాను పూచిన శంఖుచక్రాల
త్రిజగములు నేలేటి దేవసింహమా
గజభజింపుచు వచ్చి కాచుక నుతించేటి
ద్విజముని సంఘముల దేవసింహమా


ముప్పిరి దాసులకెల్లా ముందు ముందే యొసగేటి
తిప్పరాని వరముల దేవసింహమా
చిప్పల నహోబలాన శ్రీవెంకటాద్రి మీద
తెప్పల దేలేటి యట్టి దేవసింహమా

దైవమా నీ చేతిదే మాధర్మపుణ్యము


దైవమా నీ చేతిదే మాధర్మపుణ్యము
పూవు వంటి కడు లేత బుధ్ధి వారము


యేమిటి వారము నేము యిదివో మా కర్మ మెంత
భూమి నీవు పుట్టించగఁ బుట్టితిమి
నేమముతో నడచేటి నేరుపేది మావల్ల
దీముతో మోచిన తోలు దేహులము


యెక్కడ మాకిక గతి యెరిగే దెన్నడు నేము
చిక్కినట్టి నీ చేతిలో జీవులము
తక్కక నీ మాయలెల్లాఁ దాటగలమా మేము
మొక్కలపుటజ్ఞానపు ముగ్ధలము


యేది తుద మొదలు మాకిక నిందులో నీవే
ఆదిమూర్తి నీకు శరణాగతులము
యీదెస శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నీదయ గలుగగాను నీ వారము

దేవదేవుడెక్కినదె దివ్యరథము


దేవదేవుడెక్కినదె దివ్యరథము
మావంటివారికెల్ల మనోరథము


జలధి బాలులకై జలధులు వేరఁజేసి
పగటునఁ దోలెనదె పైడిరథము
మిగులగ కోపగించి మెరయురావణుమీద
తెగియెక్కి తోలెనదె దేవేంద్ర రథము


దిక్కులు సాధించి సీతాదేవితో నయోధ్యకు
పక్కన మరలిచె పుష్పకరథము
నిక్కు నరకాసురుపై నింగిమోవ నెక్కి తోలె
వెక్కసపు రెక్కలతో విష్ణు రథము


బలిమి రుఖ్మిణి దెచ్చి పరులగెల్చి యెక్కె
అలయేగుబెండ్లి కల్యాణరథము
యెలమి శ్రీవేంకటాద్రి నలమేలుమంగ గూడి
కలకాలమును నేగె ఘనమైన రథము

దేవ నీ పక్షపాతమో తిరిగే లోకుల వెల్తో


దేవ నీ పక్షపాతమో తిరిగే లోకుల వెల్తో
శ్రీవిభుడ నీవేకాదా చిత్తములోనయ్యా


దివములు సరియే దినరాత్రులును సరే
యివల సుఖదుఃఖాలు హెచ్చుకుందులేలయ్యా
భవములు సరియే ప్రాణములు సరియే
భువి పుణ్యపాపముల భోగము వేరేలయ్యా


విని కిందిరి కొకటే విషయాలు నొకరీతే
మునిగేటిజాతిబేధము లివేలయ్యా
అనయముఁ జూపొక్కటే ఆకలియు నొకటే
పెనగేటి గుణములు పెక్కుజాడ లేలయ్యా


అంతరాత్మ నీవొక్కడ వన్నిటా శ్రీవేంకటేశ
చింతలు వేవేలైన సిలుగేలయ్యా
యింతసేసీ నీమాయ లిందుకే నీశరణంటే
కాంతుడ నన్నిందుకే కాచితివి నేడయ్యా

ధారుణిపతికిని తలబాలో బహు


ధారుణిపతికిని తలబాలో బహు
దారారతునకు తలబాలో


హేమవర్ణునకు ఇందిరాపతికి
దామోదరునకు తలబాలో
సామజభయరక్షకునకు తులసీ
ధామునకు హరికి తలబాలో


కలికి రుక్మిణికి కడుతమకించే
తలదైవమునకు తలబాలో
మలసి సత్యభామకు పతి పంకజ
దళనేత్రునకును తలబాలో


తిరువేంకటమున దినపెండ్లిగల
తరుణులపతికిని తలబాలో
ఇరవుగ బాయక ఇందిరనురమున
ధరియించు హరికి తలబాలో

దేవుడవు నీవు దేవుల నేను


దేవుడవు నీవు దేవుల నేను
వావులు గూడగాను వడి సేస వెట్టితి


వలపులు నే నెఱగ వాసులెఱగను - నీవు
కలకల నవ్వితేనే కరగితిని
పలుకులు నే నేర భావించగ నే నేర
పిలిచి విడెమిచ్చితే ప్రియమందితిని


మనసు సాధించనోప మర్మము లడుగనోప
చెనకి గోర నూదితే చేకొంటిని
పెనగజాలను నేను బిగియగ జాలను
కనువిచ్చి చూచితేనే కానిమ్మంటిని


పచ్చిచేతలు రచించ బలుమారు సిగ్గువడ
మచ్చిక గాగిలించితే మరిగితిని
యిచ్చట శ్రీవెంకటేశ యేలుకొంటి విటు నన్ను
మెచ్చి కాగిలించితేను మేకొని మొక్కితిని

చేరి కొల్వరో ఈతడు శ్రీదేవుడు


చేరి కొల్వరో ఈతడు శ్రీదేవుడు
యీ రీతి శ్రీ వేంకటాద్రి నిరవైన దేవుడు


అలమేలుమంగ నురమందిడు కొన్న దేవుడు
చెలగి శంఖ చక్రాల చేతి దేవుడు
కల వరద హస్తము గటి హస్తపు దేవుడు
మలసీ శ్రీవత్స వనమాలికల దేవుడు


ఘన మకర కుణ్డల కర్ణముల దేవుడు
కనక పీతాంబర శౄంగార దేవుడు
ననిచి బ్రహ్మాదుల నాభి గన్న దేవుడు
జనించె బాదాల గంగ సంగతైన దేవుడు


కోటి మన్మథాకార సంకులమైన దేవుడు
జూటుపు కిరీటపు మించుల దేవుడు
వాటపు సొమ్ముల తోడి వసుధాపతి దేవుడు
యీటులేని శ్రీ వేంకటేశుడైన దేవుడు

చిత్తగించుమిదె చెలియ వికాసము


చిత్తగించుమిదె చెలియ వికాసము
పొత్తులు గలపీ భోగంబులకు


వెన్నెలరేకులు వెదచల్లీనిదె
సన్నల సెలవుల సకియా
కన్నులమొక్కులు కానుకలొసగీ
నిన్నుజూచి యిదె నివ్వెరగులను


జక్కవపిట్టల సంతము సేసీ
అక్కున గప్పుచు నతివా
చక్కని మోవిని చవులటు గొలిపీ
నెక్కొని నీపై నేస్తంబులను


పలుకుతేనియలు పలుమరుజిలికీ
మెలుపురతుల నలమేల్మంగ
యెలమిని శ్రీవేంకటేశ గూడితివి
అలరీ నీతో నదె సరసములా

చెప్పరాని మహిమల శ్రీదేవుడితడు


చెప్పరాని మహిమల శ్రీదేవుడితడు
కప్పి కన్నులపండుగగా చూడరో

అద్దుచు కప్పురధూళి యట్టె మేననలదగా
వొద్దిక దేవునిభావమూహించితేను
మద్దులు విరిచినట్టి మంచి బాలకృష్ణునికి
మద్దులకాంతి మేన మలసినటుండె

అమర తట్టుపుణుంగు అవధరించగాను
తమితో పోలికలెల్లా దచ్చిచూడాగా
యమునా నది నాగేట నండకు తీసుకొనగా
యమునానది నలుపు యంటినట్టుండె

అంగముల శ్రీవేంకటాధిపున కింతటాను
సింగారించి సొమ్ములెల్లా చెలరేగగా
బంగారు పుటలమేలుమంగ నురాన నుంచగా
బంగారము మేననెల్లా బరగినట్టుండె

చిత్తగించు మా మాటలు శ్రీ నరసింహా


చిత్తగించు మా మాటలు శ్రీ నరసింహా
చిత్తజ జనక వో శ్రీనరసింహా


చెలరేగి వున్నాడవు శ్రీనరసింహా - నీకు
జెలులెల్లా మొక్కేరు శ్రీనరసింహా
సెలవుల నవ్వేవిట్టే శ్రీనరసింహా - నీకే
సెలవు మావలపులు శ్రీనరసింహా


చిందీని మై చెమటలు శ్రీనరసింహా - నిన్ను
జెందినది కడు జాణ శ్రీనరసింహా
చెందమ్మి రేకుల గోళ్ళ శ్రీనరసింహా - నీపై
చిందులెల్లా పాడేము శ్రీనరసింహా


సిరినెరకాగిటి శ్రీనరసింహా - మంచి
సిరుల నహోబలము శ్రీనరసింహా
శిరసెత్తు శ్రీవేంకట శ్రీనరసింహా
చెరలాటాలికనేల శ్రీనరసింహా

చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి


చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి
మాలుగలిపి దొరతనంబు మాంపు టింత చాలదా

పుడమి పాపకర్మమేమి పుణ్యకర్మమేమి తనకు
కడపరాని బంధములకు కారణంబులైనవి
యెడపకున్న పసిడి సంకెలేమి యినుపసంకెలేమి
మెడకు దగిలి యుండి యెపుడు మీదు చూడరానివి

చలముకొన్న ఆపదేమి సంపదేమి యెపుడు తనకు
అలమిపట్టి దుఃఖములకు నప్పగించినట్టి
యెలమి బసిడిగుదియయేమి యినుపగుదియయేమి తనకు
ములుగ ములుగ తొలితొలి మోదుటింత చాలదా

కర్మియైనయేమి వికృతకర్మియైనయేమి తనకు
కర్మఫలముమీదకాంక్ష గలుగు టింత చాలదా
మర్మమెరిగి వేంకటేశు మహిమిలనుచు దెలిసినట్టి
నిర్మలాత్ము కిహము పరము నేడు గలిగె చాలదా

చూడవమ్మ యశోదమ్మ వాడ వాడల వరదలివిగో


చూడవమ్మ యశోదమ్మ వాడ వాడల వరదలివిగో

పొంచి పులివాలు పెరుగు మించు మించు మీగడలు
వంచి వారలు వట్టిన కంచపుటుట్ల కాగులివో

పేరీ బేరని నేతులు చూరల వెన్నల జున్నులును
ఆరగించి యట నగుబాళ్ళు పార వేసిన బానలివిగో

తెల్లని కను దీగల సోగల చల్ల లమ్మేటి జవ్వనుల
చెల్లినట్లనె శ్రీ వేంకటపతి కొల్లలాడిన గురుతు లివిగో

చూడుడిందరికి సులభుడు హరి


చూడుడిందరికి సులభుడు హరి
తోడు నీడయగు దొరముని యితడు


కైవల్యమునకు కనకపు తాపల-
త్రోవై శ్రుతులకు తుదిపదమై
పావన మొకరూపంబై విరజకు
నావై నున్నాడిదె యితడు


కాపాడగ లోకములకు సుజ్ఞాన
దీపమై జగతికి తేజమై
పాపాలడపగ భవపయోధులకు
తేపై యున్నాడిదే యితడు


కరుణానిధి రంగపతికి కాంచీ-
వరునకు వేంకటగిరిపతికి
నిరతి నహోబలనృకేసరికి త-
త్పరుడగు శఠగోపముని యితడూ

చూడవమ్మ కృష్ణుడు నీసుతుడోయమ్మ


చూడవమ్మ కృష్ణుడు నీసుతుడోయమ్మ
ఆడీ వీధులవేంట యశోదమ్మ

కోలలు చాచి వుట్లు గొట్టగా పాలుపెరుగు
కాలువలు గట్టి పారెగదవమ్మా
మేలములాడీ వద్దంటే మిక్కిలి గొల్లెతలతో
ఆలకించి వినవమ్మ యశోదమ్మ

చక్కిలాలకుండలెల్లా చలాన దొండ్లు వొడిచి
దిక్కన దోటికోలల దీసీనమ్మా
చిక్కని తేనె చాడె చివ్వన రాత వేసితే
అక్కడ జోరున గారె యశోదమ్మా

అల్లంతనుండి తనకందరాని తెంకాయలు
వల్లెతాళ్ళు వేసి వంచీనమ్మా
బల్లిదుడలమేల్మంగపతి శ్రీవేంకటేశుడు
అల్లిబిల్లై యున్నాడమ్మ యశోదమ్మ

చెలి నీవు మొదలనే సిగ్గరి పెండ్లి కూతురవు


చెలి నీవు మొదలనే సిగ్గరి పెండ్లి కూతురవు
ఇలనింత పచ్చిదీరె(దేరీ?) ఇదివో నీ భావము


చెక్కులవెంటా గారె చెమట తుడుచుకోవే
చక్కవెట్టుకొనవే నీ జారిన కొప్పు
అక్కుమీద పెనగొన్న హారాలు చిక్కు దీయవే
ఇక్కువల నీ కోరికె లీడేరెనిపుడు


పెదవి మీద కెంపులబేంట్లు రాలుచుకోవే
చెదరిన ముంగురులు చేత దువ్వవే
వదలిన పయ్యెద చివ్వన బిగించుకొనవే
పది(బదిగా నీనోము ఫలియించె నిపుడు


తిలకము కరగెను దిద్దుకోవే నొసలను
కలసిన గురుతులు గప్పుకొనవే
యెలమి శ్రీవేంకటేశు( డేలె నలమేలుమంగవు
తలచిన తలపులు తలకూడె నిపుడు

చలి గాలి వేడేల చల్లీనే కప్పురపు


చలి గాలి వేడేల చల్లీనే కప్పురపు
మలయజము తానేల మండీనే

పాపంపు మననేల పారీనే నలుగడల
చూపేల నలువంక జూచీనే
తాపంపు మేనేల తడవీనే పూవింటి
తూపేల చిత్తంబు దూరీనే

వాయెత్తి చిలుకేల వదరీనె పలుమారు
కోయిలలు దామేల గొణిగీనే
రాయడికి నలులేల రసీనే మాతోను
కాయజుడు తానేల కసరీనే

ఏకాంతమునేల యెదురైతినే తనకు
లోకాధి పతికేల లోనైతినే
చేకొనిదే మన్నించె శేషాద్రి వల్లభుడు
పైకొనిదె మమ్మేల పాలించెనే

చల్లని చూపులవాని చక్కనివాని


చల్లని చూపులవాని చక్కనివాని | పీలి |
చొల్లెపుఁ జుట్లవానిఁ జూపరమ్మ చెలులు


వాడలోని చెలులను వలపించి వచ్చెనే | వాడు |
చేడెల మనసు దొంగ చిన్నికృష్ణుడు
యేడుగడయునుఁ దానై యెలయించె నన్నును |వానిఁ|
జూడక వుండగ లేను చూపరమ్మ చెలులు


మందలోని గొల్లెతల మరగించి వచ్చెనే | వాడు |
సందడిపెండ్లికొడుకు జాణకృష్ణుడు
ముందు వెనకా నలమి మొహింపించె నన్నును | వాని|
పొందులు మానగ లేను పోనీకురే చెలు(లు?)


ఇంటింటి యింతుల నెల్లా యెలయించి వచ్చెనే | వాడు|
దంటవాడు కవి(లి?) కిఁచేతలకృష్ణుడు
నంటునను శ్రీవెంకటనాథుఁడై నన్నుఁ గూడెనే | వాని |
వొంటిఁ బాయలే నావద్ద నుంచరమ్మ చెలులు.

చదివితి దొల్లి కొంత చదివేనింకా గొంత


చదివితి దొల్లి కొంత చదివేనింకా గొంత
యెదిరి నన్నెఱగను యెంతైన నయ్యో

వొరుల దూషింతుగాని వొకమారైన నా
దురిత కర్మములను దూషించను
పరుల నవ్వుదుగాని పలుయోనికూపముల
నరకపు నా మేను నవ్వుకోను

లోకుల గోపింతు గాని లోని కామాదులనేటి
కాకరి శత్రువుల మీద కడు కోపించ
ఆకడ బుద్దులు చెప్పి అన్యుల బోధింతుగాని
తేకువ నాలోని హరి దెలుసుకోలేను

యితరుల దుర్గుణము లెంచి,యెంచి రోతుగాని
మతిలో నాయాసలు మానలేను
గతిగా శ్రీవేంకటేశుగని బ్రతికిగాని
తతి నిన్నాళ్ళ దాకా దలపోయలేను

చూడవయ్య నీసుదతి విలాసము


చూడవయ్య నీసుదతి విలాసము
వేడుకకాడవు విభుడవు నీవు


పున్నమివెన్నెల పోగులు వోసి
సన్నపు నవ్వుల జవరాలు
వన్నెల కుంకుమ వసంత మాడే
ఇన్నిటా కళలతో ఈ మెరుగుబోడి


పాటించి తుమ్మెద పౌజులు దీర్చీ
కాటుక కన్నుల కలికి యిదే
సూటి జక్కవల జోడలరించీ
నాటకపు గతుల నాభి సరసి


అంగజురథమున హంసలు నిలిపి
కంగులేని ఘన గజగమన
ఇంగితపు శ్రీవేంకటేశ నిన్నెనసె
పంగెన సురతపు పల్లవాధరి

చూచి వచ్చితి నీవున్నచోటికి తోడి తెచ్చితి


చూచి వచ్చితి నీవున్నచోటికి తోడి తెచ్చితి
చేచేతఁ బెండ్లాడు చిత్తగించవయ్యా


లలితాంగి జవరాలు లావణ్యవతి ఈకె
కలువకంఠి మంచి కంబుకంఠి
జలజవదన చక్రజఘన సింహమధ్య
తలిరుఁబోడిచక్కదనమిట్టిదయ్యా


అలివేణి మిగులనీలాలక శశిభాల
మలయజగంధి మహామానిని యీకె
పెలుచుమరునివిండ్లబొమ్మలది చారుబింబోష్ఠి
కని(లి?)తకుందరద చక్కందనమిట్టిదయ్యా


చెక్కుటద్దములది శ్రీకారకన్న(ర్ణ?)ములది
నిక్కుఁజన్నులరంభోరు నిర్మలపాద
గక్కన శ్రీవేంకటేశ కదిసె లతాహస్త
దక్కె నీకీ లేమ చక్కందన మిట్టిదయ్యా

చిత్తజగురుడ వో శ్రీనరసింహా


చిత్తజగురుడ వో శ్రీనరసింహా
బత్తిసేసేరు మునులు పరికించవయ్యా


సకలదేవతలును జయవెట్టుచున్నారు
చకితులై దానవులు సమసిరదె
అకలంకయగు లక్ష్మియటు నీ తొడపై నెక్కె
ప్రకటమైన నీ కోపము మానవయ్యా


తుంబురునారదాదులు దొరకొని పాడేరు
అంబుజాసనుడభయమడిగీనదె
అంబరవీధి నాడేరు యచ్చరలందరుగూడి
శంబరరిపుజనక శాంతము చూపవయ్యా


హత్తి కొలిచేరదె యక్షులును గంధర్వులు
చిత్తగించు పొగడేరు సిద్ధసాధ్యులు
సత్తుగా నీ దాసులము శరణు చొచ్చితి మిదె
యిత్తల శ్రీవేంకటేశ యేలుకొనవయ్యా

చిన్నవాడు నాలుగుచేతులతోనున్నాడు


చిన్నవాడు నాలుగుచేతులతోనున్నాడు
కన్నప్పుడే శంఖముచక్రముచేతనున్నది


నడురెయి రోహిణి నక్షత్రమునబుట్టె
వడి కృష్ణుడిదివో దేవతలందు
పడిన మీ బాధలెల్ల ప్రజలాల యిప్పుడిట్టె
విడుగరాయ మీరు వెరవకుడికను


పుట్టుతనె బాలుడు అబ్బురమైన మాటలెల్ల
అట్టె వసుదేవుని కానతిచ్చెను
వట్టిజాలింకేల దేవతలాల మునులాల
వెట్టి వేములు మానెను వెరవకుడికను


శ్రీవేంకటనాథుడే యీసిసువు తానైనాడు
యీవల వరము లెల్లా నిచ్చుచును
కావగ దిక్కైనా డిక్కడనె వోదాసులల
వేవేగ వేడుకతోడ వెరవకుడికను

చదివి చదివి వట్టి జాలిబడుటింతే గాక


చదివి చదివి వట్టి జాలిబడుటింతే గాక
యెదుట నిన్ను గానగ నితరుల వశమా


ఆకాశముపొడవు ఆకాశమేయెరుగు
ఆకడ జలధిలోతు ఆ జలధే యెరుగు
శ్రీకాంతుడ నీఘనము చేరి నీవే యెరుగుదు
వీకడ నింతంతన నితరుల వశమా


నదుల యిసుకలెల్ల నదులే యెరుగును
కదిలి గాలియిరవు గాలికే తెలుసు
అదన నాత్మగుణము లంతరాత్మ నీవెరుగు -
దిదియదిననిచెప్ప నితరుల వశమా


శ్రీవేంకటేశ యిన్నిచింతలకు మొదలు
యీవల నీశరణంటే యిటు నీవే యెరిగింతు
దైవమా నీకల్పనలు తగనీవే యెరిగింతు
వీవల నౌగాదన నితరులవశమాక

చూడచిన్నదానవింతే సుద్దులు కోటానఁగోటి


చూడచిన్నదానవింతే సుద్దులు కోటానఁగోటి
యేడేడ నేరుచుకొంటివే వో కలికి


కిన్నెరమీటులలోని గిలిగింతలు , నీ
వన్నెల కనుచూపుల వలవంతలు
యెన్నరాని యిచ్చకపు టెలయింతలు
యెన్నడు నేరుచుకొంటివే వో కలికి



సారెకు నెడవాయని సరసములు , నీ
తారుకాణ సన్నల తమకములు
గారవించి బుజ్జగించే గమకములు
యేరీతి నేరుచుకొంటివే వో కలికి


కందువ శ్రీవేంకటేశు కలయికలు , నీ
యందమైన సమరతి యలయికలు
పొందుల మునుముంగిలి పొలయికలు
యెందెందు నేరుచుకొంటివే వో కలికి

చూడరమ్మ యిదె నేడు సుక్కురారము


చూడరమ్మ యిదె నేడు సుక్కురారము
వేడుక చక్కదనాలు వేవేలైనాడు


చప్పుడుతో పన్నీటి మజ్జనముతో నున్నవాడు
అప్పుడే ఆదినారాయాణునివలె
కప్పురకాపామీద కడుఁబూసుకున్నవాడు
ముప్పిరి బులుకడిగె ముత్యమువలె


పొసగెనప్పటి తట్టుపుణుగులందుకున్నాడు
కసుగందని కాలమేఘమువలెను
సుసగాన మేనునిండా సొమ్మువెట్టుకున్నాడు
పసల పద్దరువన్నె బంగారువలెను


అలమేల్మంగను యురమందు నిడుకొన్నవాడు
యెలమి సంపదలకు యిల్లువలెను
అలరుచు శ్రీవేంకటాద్రిమీదనున్నవాడు
కలబోసి చూడగా దొంతరకొండవలెను

చెప్పరాని మహిమల శ్రీధరా నీవు


చెప్పరాని మహిమల శ్రీధరా నీవు
చెప్పినట్టు చేసేము శ్రీధరా


చేర దీసి నా కన్నుల శ్రీధరా నీ
జీరల మేను చూచితి శ్రీధరా
చేరువ సంతోషమబ్బె శ్రీధరా
చీరుమూరాడెదమీ శ్రీధరా


చెల్లు నన్నియును నీకు శ్రీధరా నీ
చిల్లరసతులు వారే శ్రీధరా
చెల్లబో ఆ సుద్ది విని శ్రీధరా నాకు
చిల్లులాయె వీనులెల్లా శ్రీధరా


సేవలు సేసేము నీకు శ్రీధరా మమ్ము
జేవదేరగూడితివి శ్రీధరా
చేవల్లకు రావోయి శ్రీధరా
శ్రీవేంకటాద్రి మీది శ్రీధరా

భావములోన బాహ్యమునందును


భావములోన బాహ్యమునందును 
గోవిందగోవిందయని కొలువవో మనసా
 

 హరియవతారములే అఖిలదేవతలు 
హరిలోనివే బ్రహ్మాణ్డములు
హరినామములే అన్ని మంత్రములు 

హరిహరి హరిహరి యనవోమనసా
 

విష్ణుని మహిమలే విహిత కర్మములు 
విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు

విష్ణువు విష్ణువని వెదకవో మనసా
 

 అచ్యుతుడితడె ఆదియునంత్యము 
అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె 

అచ్యుత అచ్యుత శరణనవో మనసా

బ్రహ్మ కడిగిన పాదము


బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము


చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము


కామిని పాపము కడిగిన పాదము 

పాము తలనిడిన పాదము
ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము 

పామిడి తురగపు పాదము

పరమ యోగులకు పరి పరి విధముల 

పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన 

పరమ పదము నీ పాదము

బ్రహ్మమొక్కటె పర - బ్రహ్మమొక్కటె


తందనాన అహి - తందనాన పురె
తందనాన భళా - తందనాన


బ్రహ్మమొక్కటె పర - బ్రహ్మమొక్కటె
పరబ్రహ్మమొక్కటె పర బ్రహ్మమొక్కటె


కందువగు హీనాధికములిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మంతానొక్కటె
అందరికి శ్రీహరే అంతరాత్మ


నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటె
అంటనే బంటునిద్ర అదియు నొకటె
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటె
చండాలు డుండేటి సరిభూమి యొకటే


కడగి యేనుగు మీద కాయు యెండొకటే
పుడమి శునకము మీద బొలయు యెండొకటే
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వరుని నామమొకటె

భావయామి గోపాలబాలం మన


భావయామి గోపాలబాలం మన
సేవితం తత్పదం చింతయేయం సదా


కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా
పటల నినదేన విభ్రాజమానం
కుటిల పద ఘటిత సంకుల శింజీతేన తం
చటుల నటనా సముజ్జ్వల విలాసం ... భావయామి


నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది
సుర నికర భావనా శోభిత పదం
తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం
పరమపురుషం గోపాలబాలం … భావయామి

బండి విరిచి పిన్న పాపలతో నాడి


బండి విరిచి పిన్న పాపలతో నాడి 
దుండగీడు వచ్చె దోబూచి

పెరుగు వెన్నలు బ్రియమున వే
మరు ముచ్చిలించు మాయకాడు
వెరవున్నాదన విధము దాచుకొని
దొరదొంగ వచ్చె దోబూచి


పడచు గుబ్బెత పరపుపై పోక
ముడి గొంగు నిద్రముంపునను
పడియు దావద్ద బవళించినట్టి
తోడుకు దొంగ వచ్చె దోబూచి


గొల్లెపల్లెలో యిల్లిల్లు చొచ్చి కొల్లెలాడిన కోడెకాడు
యెల్లయినా వేంకటేశుడు ఇదే తొల్లిటి దొంగ వచ్చె దోబూచి

భారమైన వేపమాను పాలువోసి పెంచినాను


భారమైన వేపమాను పాలువోసి పెంచినాను 
తీరని చేదేకాక/ని దియ్యనుండీనా


పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి నాను 
చాయ కెంతగట్టినాను చక్కనుండీనా
కాయపు వికారమిది కలకాలము జెప్పినా 
పోయిన పోకలే కాక బుద్ధి వినీనా


ముంచిముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా 
మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యి నా
పంచమహాపాతకాల బారి బడ్డచిత్తమిది 
దంచి దంచి చెప్పినాను తాకి వంగీనా


కూరిమితో దేలుదెచ్చి కోకలోన బెట్టుకొన్నా 
సారె సారె గుట్టుగాక చక్కనుండీనా
వేరులేని మహిమల వేంకటవిభుని కృప 
ఘోరమైన ఆస మేలుకోర సోకీనా

భళి భళి రామ పంతపు రామ నీ


భళి భళి రామ పంతపు రామ నీ-
బలిమి కెదురు లేరు భయహర రామా


విలువిద్య రామా వీరవిక్రమ రామ
తలకొన్నతాటకాంతక రామా
కొలయై ఖరుని తలగుండుగండ రామా
చలమరి సమరపు జయరామ రామా


రవికులరామా రావణాంతక రామ
రవిసుతముఖకపిరాజ రామ
సవర(గా కొండలచే జలధిగట్టిన రామ
జవసత్త్వసంపన్న జానకీరామా


కౌసల్యారామా కరుణానిధిరామ
భూసురవరద సంభూతరామా
వేసాల పొరలే శ్రీవేంకటాద్రిరామ
దాసులమమ్ము కావ(దలకొన్న రామా

భక్తి కొలది వాడే పరమాత్ముడు


భక్తి కొలది వాడే పరమాత్ముడు
భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు


పట్టిన వారిచే బిడ్డా పరమాత్ముడు
బట్ట బయటి ధనము పరమాత్ముడు
పట్టపగటి వెలుగు పరమాత్ముడు
ఎట్ట ఎదుటనే ఉన్నాడిదె పరమాత్ముడు


పచ్చి పాలలోని వెన్న పరమాత్ముడు
బచ్చన వాసిన రూపు పరమాత్ముడు
బచ్చు చేతి వొరగల్లు పరమాత్ముడు
యిచ్చ కొలది వాడువో యీ పరమాత్ముడూ


పలుకులలోని తేట పరమాత్ముడు
ఫలియించునిందరికి పరమాత్ముడు
బలిమి శ్రీవేంకటాద్రి పరమాత్ముడు
యెలమి జీవుల ప్రాణమీ పరమాత్ముడు

బ్రహ్మపూజించే రఘుపతి విభీషుణు కిచ్చె


బ్రహ్మపూజించే రఘుపతి విభీషుణు కిచ్చె
బ్రహ్మణ్యుడీ రంగపతి గొలువరో


కావేరీ మధ్య రంగక్షేత్ర మల్లదిగో
శ్రీవిమాన మదిగో శేషపర్యంక మిదె
దేవు(డల్లదె వాడే దేవి శ్రీలక్ష్మి యదె
సేవించరో నాభి( జిగురించె నతడూ


యేడు గోడలు నవిగో యెసగు పూదోపు లవె
కూడి దామోదరపురగోపుర మదె
తోడ వేయిగంబాల దొడ్డమంటప మదిగో
చూడరో పసిడిమించులకంబ మదిగో


ఆళువారులు వారే యంగరంగవిభవమదె
వాలు శ్రీవైష్ణవపు వాడ లవిగో
ఆలీల శ్రీవేంకటేశుడై వర మిచ్చీని
తాలిముల శ్రీరంగ దైవము గొలువరో

భోగీంద్రులును మీరు బోయి రండు


భోగీంద్రులును మీరు బోయి రండు
వేగగ మీదటి విభవాలకు


హరుడ పోయిరా అజుడ నీవును బోయి 
తిరిగిరా మీదటి తిరునాళ్ళకు
సురలు మునులును భూసురలు బోయిరండు 
అరవిరి నిన్నాళ్ళు నలసితిరి


జముడ పోయిరా శశియు నీవును బోయి
సుముఖుడవై రా సురల గూడి
గుములై దిక్పతులు దిక్కులకు బోయిరండు 
ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి


నారద సనక సనందాదులు 
భూరివిభవముల బోయిరండు
దూరముగా బోకిట్టే తొరలి వేంకటగిరి 
జేరి నన్నిట్లనే సేవించుడీ

భావించి చూడరే పడాతులాల


భావించి చూడరే పడాతులాల
చేవదేరి మహిమలు చెలగినట్టుండెను


పరమపురుషునికి పచ్చకప్పురముకాపు
తిరుమేన నమరెను తెల్లనికాంతి
ధరలో పాలజలధి తచ్చేటివేళను
మురిపెమై తుంపురులు ముంచినయట్టుండ్ను


తవిలి యీదేవునికి తట్టుపుణుగుకాపు
నవమై మేన నమరె నల్లనికాంతి
తివిరి గోవర్ధనమెత్తినాడు నిందుకొని
ధ్రువమై మేఘకాంతులు తొలకినట్టుందెను


శ్రీవేంకటేశునికి సింగారించిన సొమ్ములు
భావించ మేన నమరే బంగారుకాంతి
తావుగా నలమేల్మంగ తనవుర మెక్కగాను
వేవేలుసంపదలెల్లా వెలసినట్టుండెను

భావించి తెలుసుకొంటే భాగ్యఫలము


భావించి తెలుసుకొంటే భాగ్యఫలము
ఆవలీవలి ఫలములు అంగజజనకుడే


దానములలో ఫలము తపములలో ఫలము
మోస(న)ములలో ఫలము ముకుందుడే
జ్ఞానములలో ఫలము జపములలో ఫలము
నానా ఫలములు నారాయణుడే


వినుతులలో ఫలము వేదములలో ఫలము
మనసులోని ఫలము మాధవుడే
దినములలో ఫలము తీర్థయాత్రల ఫలము
ఘనపుణ్యముల ఫలము కరుణాకరుడే


సతతయోగ ఫలము చదువులలో ఫలము
అతిశయోన్నత ఫలము యచ్యుతుడే
యతులలోని ఫలము జితకామిత ఫలము
క్షితి మోక్షము ఫలము శ్రీవేంకటేశుడే

బిరుదు బంటితడు పెద్ద హనుమంతుడు


బిరుదు బంటితడు పెద్ద హనుమంతుడు
సిరులతో రామునికి సీతాదేవికిని

మూడులోకములు తుదముట్టపెరిగినవాడు
వాడే హనుమంత దేవర జూడరో
పోడిమి దైత్యుల గెల్చి పూచి చేయెత్తుకున్నాడు
వాడి ప్రతాపము తోడ వాయుజుడు

ధ్రువమండలము మోవ తోక యెత్తుకున్నవాడు
సవరనై పెనుజంగ చాచుకున్నాడు
భువి కవచకుండలంబులతో పుట్టినవాడు
వివరించ నేకాంత వీరుడైనాడు

పెనచి పండ్లగొల పిడికిలించుకున్నాడు
ఘనుడిన్నిటా స్వామికార్యపరుడు
వినయపు శ్రీవేంకటవిభునికి హితవరి
యెనసి మొక్కగదరో యెదుటనున్నాడు

బడలెను పానుపు పరచరే


బడలెను పానుపు పరచరే 
అడుగరే యిదియేమని చెలులు

చెలప చెమటలు మై( జిప్పిలీని
అలసి వచ్చినాడు నేడదే విభుడు
చలువగా( గప్రము పై చల్లగదరే
వెలయ సురటిగొని విసరరే


పొనుగు నిట్టూరుపుల బుసకొట్టీని
పనిసేసి వచ్చినా డప్పటి విభుడు
తనివార చల్లనిగంధము మెత్తరే
నినుపుగ పన్నీరు నించరే


దాగక దప్పి మోవులు దడిపీని
కాగి వచ్చినాడు శ్రీవేంకటవిభుడు
పాగి వాసించినబాగాలియ్యరే
చేగదేర నన్నునేలె సేవలెల్లా జేయరే

భావమెరిగిన నల్ల(బల్లి చెన్నుడా


భావమెరిగిన నల్ల(బల్లి చెన్నుడా
నావద్దనే వుండుమీ నల్ల(బల్లి చెన్నుడా

వేసరక నీవు నాతో వేమారు జేసినట్టి
బాసలు నమ్మితి నల్ల(బల్లి చెన్నుడా
వాసికి వన్నెకు నీకు వలచి చొక్కితి నేను
నా సూటికే మన్నించు నల్ల(బల్లి చెన్నుడా


క్రియ గూడ నేను నీ కేలువట్టి పెండ్లాడితి
బయలీదించకు నల్ల(బల్లి చెన్నుడా
ప్రియములు రెట్టింప బెనగితి నిందాకా
నయములు చూపుమీ నల్ల(బల్లి చెన్నుడా


యెనసితి విటు నన్ను నియ్యకోలు సేసుకొని
పనుపడె రతి నల్ల(బల్లి చెన్నుడా
ఘన శ్రీవేంకటాద్రిపై కందువ నేలుకొంటివి
నను నిందరిలోపల నల్ల(బల్లి చెన్నుడా

భక్తసులభుడును పరతంత్రుడు హరి



భక్తసులభుడును పరతంత్రుడు హరి
యుక్తిసాధ్యమిదె యొకరికీ గాడు

నినుపగు లోకములు నిండినవిష్ణుడు
మనుజుడ నాలో మనికియయ్యె
మునుకొని వేదముల ముడిగిన మంత్రము
కొననాలికలలో గుదురై నిలిచె

యెలమి దేవతల నేలిన దేవుడు
నలుగడ నధముని నను నేలె
బలుపగు లక్ష్మీ పతియగు శ్రీహరి
యిల మాయింటను యిదివో నిలిచె

పొడవుకు పొడవగు పురుషోత్తముడిదె
బుడిబుడి మాచేత పూజగొనె
విడువ కిదివో శ్రీవేంకటేశ్వరుడు
బడివాయడు మాపాలిట నిలిచి

బాపు బాపు కృష్ణ బాలకృష్ణా


బాపు బాపు కృష్ణ బాలకృష్ణా
బాపురే నీ ప్రతాప భాగ్యము లివివో


బాలుడవై రేపల్లె పాలు నీవారగైంచ
పాల జలనిధి యెంత భయపడెనో
ఆలించి తొదలుమాట లాడనేర్చుకొనగ
యీలీల నసురసతు లెంత భ్రమసిరో


తప్పటడుగులు నీవు ధరమీద పెట్టగాను
తప్పక బలీంద్రుడేమి దలచినాడో
అప్పుదే దాగిలిముచ్చు లందరితో నాడగాను
చెప్పేటివేదాలు నిన్ను జేరి యెంత నగునో


సందడి గోపికల చంకలెక్కి వున్ననాడు
చెంది నీవురము మీది శ్రీసతి యేమనెనో
విందుగ శ్రీవేంకటాద్రి విభుడవై యున్న నేడు
కందువైన దేవతల ఘనత యెట్టుండెనో

బలవంతుడితని బంట్లమై బ్రతుకుదుము


బలవంతుడితని బంట్లమై బ్రతుకుదుము
కిలకిల నవ్వీ సుగ్రీవ నరసింహుడు


దేవదేవుడితడు తేజోరాశి యితడు
భావించ నలవిగాని బ్రహ్మ మితడు
శ్రీవల్లభుడితడు జీవరక్షకుడితడు
కేవలమయిన సుగ్రీవనరసింహుడు


పరమాత్ముడితడు భయహరుడితడు
నిరుపమగుణముల నిత్యుడితడు
వరదుడితడు సర్వవంద్యుడు నీతడు
గిరిగుహలోని సుగ్రీవ నరసింహుడు


లరూపుడితడు కరుణానిధియితడు
మేలిమి జగత్తులకు మేటి యీతడు
మూలమై శ్రీవేంకటశైల నిలయుడితడు
కీలకమిన్నిటికి సుగ్రీవ నరసింహుడు

భారము నీపై వేసి బ్రతికియుండుటే మేలు


భారము నీపై వేసి బ్రతికియుండుటే మేలు
నారాయణుడా నీవే నాకుఁ గలవనుచు


శరణన్నా వెరపయ్యీ సామజముఁ గాచినట్టు
వరుస దావతీ పడి వచ్చేవంటా
హరికృష్ణాయనవెరపయ్యీ ద్రౌపదివర
మిరవుగా నిచ్చినట్టు నిచ్చేవో యనుచు


చేతమొక్క వెరపయ్యీ చీరలిచ్చి యింతులకు
బాతీపడ్డట్టె నన్నుఁ బైకొనేవంటా
ఆతల నమ్మగ వెరపయ్యీ పాండవులవలె
గాతరాన వెంట వెంటఁ గాచియుండేవనుచు


ఆరగించుమన వెరపయ్యీ శబరి వలె
ఆరయ నెంగిలి యనకంటేవంటా
యేరీతి నన వెఱతు ఇచ్చైనట్ట్లఁ గావు
కూరిమి శ్రీవేంకటేశ గోవులగాచినట్లు

అప్పుడెట్టుండెనో చిత్తమయ్యో యెఱగనైతి


అప్పుడెట్టుండెనో చిత్తమయ్యో యెఱగనైతి
చెప్పుడుమాటలకే నే జేరనైతిగా


కొసరికొసరి నీపై కోపమున నుంటిగాని
అసమిచ్చి నీతో మాటలాడనైతిగా
పసలేని సిగ్గుతోడి పంతాననే వుంటిగాని
ముసిముసి నవ్వు మోవి మోపనైతిగా


విరహపు కాకల నావిసుపే చూపితిగాని
సరిబిల్చితే నూకొన జాలనైతిగా
వరుసవంతులకై నే వాదులాడితి గాని
మురిపేన మొక్కితే నే మొక్కనైతిగా


వేగమే నీవు గూడితే వెస భ్రమసితిగాని
చేగలనీమేను పచ్చిసేయనైతిగా
భోగపు శ్రీవేంకటేశ పోట్లదొరతిలోన
నీగతి చెన్నుడవైతే నెనసితిగా

అదివో కనుగొను మది యొకతె


అదివో కనుగొను మది యొకతె
యెదుటనె నెలకొనె నిది యొకతె


తేటల మాటల తెరలదె కట్టీ
గాటుకకన్నుల కలికొకతె
జూటరిచూపులఁ జొక్కులు చల్లీ
నీటుగర్వముల నెలతొకతె


ముసిముసినవ్వుల మోపులుగట్టీ
రసికుడ నీపై రమణొకతె
కొసరుల కుచములఁ గోటలు వెట్టీ
మిసమిస మెఱుగుల మెలుతొకతె


కాయజకేలికి కందువ చెప్పీ
చాయలసన్నల సతి యొకతె
యీయెడ శ్రీవేంకటేశ కూడి నిను
వోయని మెచ్చీ నొకతొకతె

అన్నిటా జాణడు అలమేలుమంగపతి


అన్నిటా జాణడు అలమేలుమంగపతి
పన్ని నీకు మేలువాడై పరగివున్నాడు


పట్టినదే పంతమా పతితోడ నీకిప్పుడు
యిట్టె నిన్ను వేడుకోగా నియ్యకోరాదా
వొట్టి యప్పటినుండి నీవొడి వట్టుకొన్నవాడు
గట్టువాయ తనమేల కరగవే మనసు


చలములే సాదింతురా సారెసారెనాతనితో
బలిమి బిలువగాను పలుకరాదా
కలపుకోలు సేసుక కాగిలించుకున్నవాడు
పులుచుదనములేల పెనగవే రతిని


చేరి ఇట్టె బిగుతురా శ్రీవేంకటేశ్వరునితో
మేరతో నిన్నేలగాను మెచ్చగరాదా
యీరీతి నిన్ను పెండ్లాడె యెడయెక వున్నవాడు
వీరిడితనకులేల వెలయవే మరిగి

అందరికి సులభుడై అంతరాత్మ యున్నవాడు


అందరికి సులభుడై అంతరాత్మ యున్నవాడు
యిందునే శేషగిరిని యిరవై విష్ణుడు


యోగీశ్వరుల మతినుండేటి దేవుడు క్షీర -
సాగరశాయియైన సర్వేశుడు
భాగవతాధీనుడైన పరమపురుషుడు
ఆగమోక్తవిధులందు నలరిననిత్యుడు


వైకుంఠమందునున్న వనజనాభుడు పర-
మాకారమందునున్న ఆదిమూరితి
ఆకడసూర్యకోట్లందునున్న పరంజ్యోతి
దాకొన బ్రహ్మాండాలు ధరించిన బ్రహ్మము


నిండువిస్వరూపమై నిలిచినమాధవుడు
దండివేదంతములు వెదకే ధనము
పండిన కర్మఫలము పాలికివచ్చినరాసి
అండనే శ్రీవేంకటేశుడైన లోకబంధుడు

అన్నియును నతనికృత్యములే


అన్నియును నతనికృత్యములే
ఎన్నియైనా నవునతడేమిసేసినను


అణురేణుపరిపూర్ణుడవలిమోమైతేను
అణువౌను కమలభవాండమైన
ఫణిశయనునికృపాపరిపూర్ణమైతే
తృణమైన మేరువౌ స్థిరముగా నపుడే


పురుషోత్తముని భక్తి పొరపొచ్చమైతే
ఎరవులౌ నిజసిరులు ఎన్నైనను
హరిమీదిచింత పాయక నిజంబైతే
నిరతి పట్టినవెల్లా నిధానములే


మదనగురునిసేవ మదికి వెగటైతేను
పదివేలు పుణ్యంబులు పాపంబులే
పదిలమై వేంకటపతిభక్తి గలితేను
తుదిపదంబునకెల్లఁ దొడవవునపుడే

అదియెపో శ్రీహరి నామము


అదియెపో శ్రీహరి నామము
తుదిపదమిదియె ధృవమై కలిగె


తొడరి చిత్రకేతు డే నామము
తడవి లోకమంతయు గెలిచె
విడువక బ్రహ్మయు వెస నే నామము
బడిబడి నుడుగుచు ప్రభుడై నిలిచె


హరుడే నామము అదె తారకముగ
నిరతిఁదడవి యెన్నిక మీరె
ధర నే నామము దలచి నారదుడు
సురమునియై సంస్తుతులకు నెక్కె


ధృవుడే నామము దొరకొని నుతియించి
ధృవ పట్టంబున తుద బ్రదికె
జవళి శ్రీ వేంకటేశ్వరుదాసులెల్లాను
భువి నేనామము భోగించి మనిరి

అతిసులభం బిది యందరిపాలికి


అతిసులభం బిది యందరిపాలికి  
గతియిది శ్రీపతి కైంకర్యంబు


పాలసముద్రము బలిమి దచ్చి కొని-
రాలరి దేవత లమృతమును
నాలుక నిదె హరినామపుటమృతము 
యేల కానరో యిహపరసుఖము


అడరి బాతిపడి యవని దేవతలు 
బడివాయరు యజ్ఞ భాగాలకు
విడువక చేతిలో విష్ణుప్రసాదము 
కడిగడియైనది కానరుగాని


యెక్కుదురు దిగుదు రేడులోకములు 
పక్కన దపముల బడలుచును
చిక్కినాడు మతి స్రీవేంకటేశ్వరు-
డిక్కడితుదిపద మెఱగరుగాని

అయనాయ వ్యంగమేలే అతివా


అయనాయ వ్యంగమేలే అతివా ! నీ -
ఆయమే తాకీ మాట లందుకేమీ సేతురా


కప్పురమిందవే వోకలికీ ! మాకు -
నుప్పులవు నీకప్పురా లొల్లము పోరా
తప్పనాడే వదియేమే తరుణీ ! వోరి
తప్పులెవ్వరెందున్నవో తలచుకో నీవు


నిమ్మ పండిందవే వీ నెలతా ! ఆ -
నిమ్మపండే పాపరవును నే నొల్లరా
చిమ్మేవు సట లిదేమే చెలియ మేన
చిమ్మురేఖ లెవ్వరందో చిత్తగించు నీవు


కుంకుమపూ నిందవే వో కోమలీ ! నీ -
కుంకుమలే పుప్పుడౌను కూడుకుంటేను
యింకనేలే కలసితి నింతీ ! వోరి
యింకపు శ్రీవేంకటేశ యిద్దరి చెమటలు

ఆడరానిమాటది గుఱుతు


ఆడరానిమాటది గుఱుతు
వేడుకతోనే విచ్చేయమనవే


కాయజకేలికిఁ గడుఁ దమకించగ
ఆయములంటిన దది గుఱుతు
పాయపు పతికినిఁ బరిణాముచెప్పి
మోయుచు తనకిటు మొక్కితిననవే


దప్పిమోవితో తా ననుఁ దిట్టగ -
నప్పుడు నవ్విన దది గుఱుతు
యిప్పుడు దనరూ పిటు దలచి బయలు
చిప్పిల గాగిటఁ జేర్చితిననవే


పరిపరివిధముల పలుకులుఁ గులుకగ
అరమరచి చొక్కినదది గుఱుతు
పరగ శ్రీవేంకటపతి కడపలోన
సరవిగూడె నిక సమ్మతియనవే

ఆనంద నిలయ ప్రహ్లాద వరదా


ఆనంద నిలయ ప్రహ్లాద వరదా
భాను శశి నేత్ర జయ ప్రహ్లాద వరదా

పరమ పురుష నిత్య ప్రహ్లాద వరదా
హరి అచ్యుతానంద ప్రహ్లాద వరదా
పరిపూర్ణ గోవింద ప్రహ్లాద వరదా
భరిత కల్యాణగుణ ప్రహ్లాద వరదా

భవరోగ సంహరణ ప్రహ్లాద వరదా
అవిరళ కేశవ ప్రహ్లాద వరదా
పవమాన నుత కీర్తి ప్రహ్లాద వరదా
భవ పితామహ వంద్య ప్రహ్లాద వరదా

బల యుక్త నరసింహ ప్రహ్లాద వరదా
లలిత శ్రీ వేంకటాద్రి ప్రహ్లాద వరదా
ఫలిత కరుణారస ప్రహ్లాద వరదా
బలి వంశ కారణ ప్రహ్లాద వరదా

 

ఆతడితడా వెన్న లంతట దొంగిలినాడు


ఆతడితడా వెన్న లంతట దొంగిలినాడు
యేతులకు మద్దులు రెండిలఁ దోసినాడు


యీతడా దేవకిఁగన్న యింద్రనీలమాణికము
పూతకిచన్ను దాగి పొదలినాడు
యీతడా వసుదేవుని యింటిలో నిధానము
చేతనే కంసునిఁ బుట్టచెండుసేసినాడు


మేటియైన గొంతి(కుంతి?)దేవి మేనల్లు డీతడా
కోటికిఁ బడెగెగాను కొండ యెత్తెను
పాటించి పెంచేయశోదపాలి భాగ్య మీతడా
వాటమై గొల్లెతలను వలపించినాడు


ముగురు వేలుపులకు మూలభూతి యీతడా
జిగినావుల పేయలఁ జేరి కాచెను
మిగుల శ్రీవేంకటాద్రిమీదిదైవమీతడా
తగి రామకృష్ణావతార మందె నిప్పుడు

అచ్చపురాల యమునలోపల


అచ్చపురాల యమునలోపల
ఇచ్చగించి భుజియించితి కృష్ణ


ఊరుగాయలును నొద్దికచద్దులును
నారగింపుచును నందరిలో
సారె బాలుల సరసాల తోడ
కోరి చవులు గొంటివి కృష్ణా


ఆకసంబున కాపుర ముఖ్యులు
నాకలోకపు నాందులును
కైకొని యజ్ఞకర్తయాతడని
జోక గొనియాడఁ జొక్కితి కృష్ణా


పేయలు లేవు పిలువుడనుచు
కోయని నోరఁగూతలును
మాయల బ్రహ్మము మతము మెచ్చుచు
చేయని మాయలు సేసితి కృష్ణా

అదెవచ్చె నిదెవచ్చె అచ్యుతుసేనాపతిపదిదిక్కులకు నిట్టె పారరో యసురులు


అదెవచ్చె నిదెవచ్చె అచ్యుతుసేనాపతిపదిదిక్కులకు నిట్టె పారరో యసురులు

గరుడధ్వజంబదె ఘనశంఖరవమదె
సరుసనే విష్ణుదేవుచక్రమదె
మురవైరిపంపులవె ముందరిసేనలవె
పరచి గగ్గుల కాడై(ఱై) పారరో దానవులు


తెల్లని గొడుగులవె దేవదుందుభులు నవె
యెల్లదేవతరథా లింతటా నవె
కెల్లురేగీ నిక్కి హరికీర్తి భుజములవె
పల్లపు పాతాళానఁ బడరో దనుజులు


వెండిపైడిగుదె లవె వెంజామరములవె
మెండగు కైవారాలు మించిన వవె
దండి శ్రీవేంకటపతి దాడిముట్టె నదెయిదె
బడుబండై జజ్జరించి పారరో దైతేయులు

అనుచు మునులు ఋషు లంతనింత


అనుచు మునులు ఋషు లంతనింత నాడగానువినియు విననియట్టె వీడె యాడెగాని

ముకుందుఁడితడు మురహరుడితడు
అకటా నందునికొడుకాయగాని
శకుంతగమనుడితడు సర్వేశుడితడు
వెకలి రేపల్లెవీధి విహరించీగాని


వేదమూరితి యితడు విష్ణుదేవుడితడు
కాదనలేక పసులఁ గాచీగానీ
ఆదిమూలమీతడు యమరవంద్యుడితడు
గాదిలిచేతల రోలఁ గట్టువడెగాని


పరమాత్ముడితడే బాలుడై యున్నాడుగాని
హరి యీతడే వెన్నముచ్చాయెగాని
పరగ శ్రీవేంకటాద్రిపతియును నీతడె
తిరమై గొల్లెతలచేఁ దిట్టువడీగానీ

అందరి వశమా హరి నెరుగ


అందరి వశమా హరి నెరుగ
కందువగ నొకడు గాని యెరగడు

లలితపు పదికోట్ల నొకడు గాని
కలుగడు శ్రీ హరి గని మనగ
ఒలసి తెలియు పుణ్యులకోట్లలో
ఇలనొకడు గాని యెరగడు హరిని

శ్రుతి చదివిన భూసుర కోట్లలో
గతియును హరినె యొకానొకడు
అతి ఘనులట్టి మహాత్మ కోటిలో
తతి నొకడు గాని తలచడు హరిని

ఆంజనేయ అనిలజ హనుమంత


ఆంజనేయ అనిలజ హనుమంత
శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత
శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత నీ
రంజకపు చేతలు సురలకెంత వశమా


తేరిమీద నీ రూపు తెచ్చిపెట్టి ఆర్జునుడు
కౌరవుల గెలిచే సంగర భూమిని
సారెకు భీముడు పురుషాముగ్రము తెచ్చు చొట
నీరోమములు కావ నిఖిల కారణము


నీ మూలమునగాదె నెలవై సుగ్రీవుడు
రాముని గొలిచి కపిరాజాయను
రాముడు నీ వంకనేపొ రమణి సీతా దేవి
ప్రేమముతో మగుడా పెండ్లాడెను


బలుదైత్యులను దుంచ బంటు తనము మించ
కలకాలమునునెంచ కలిగితిగా
అల శ్రీవేంకటపతి అండనె మంగాంబుధి
నిలయపు హనుమంత నెగడితిగా

అభయదాయకుడ వదె నీవేగతి


అభయదాయకుడ వదె నీవేగతి ఇభరక్షక నన్నిపుడు కావవే

భయహారదైత్యేయ భంజనకేశవ జయజయ నృసింహ సర్వేశ్వరా
నియతము మాకిదె నీపాదములే గతి క్రియగా మమ్మేలి కింకలుడుపవే

బంధవిమోచన పాపవినాశన సింధురవరదా శ్రితరక్షక
కంధర వర్ణుడ గతి నీనామమె అంధకారముల నణచి మనుపవే

దైవశిఖామణి తతచక్రాయుధ శ్రీవేంకటగిరి శ్రీరమణా
సావధాన నీశరణ్యమే గతి వేవేలకు నా విన్నపమిది

అందిచూడగ నీకు అవతారమొకటే


అందిచూడగ నీకు అవతారమొకటే
 యెందువాడవైతివి యేటిదయ్యా

నవనీతచోర నాగపర్యంకా
 సవనరక్షక హరీ చక్రాయుధా  
అవల దేవకిపట్టివని యశోదకు నిన్ను
నివల కొడుకవనేదిది యేటిదయ్యా
 
పట్టపు శ్రీరమణ భవరోగవైద్య
 జట్టిమాయలతోడి శౌరి కృష్ణ  
పుట్టినచోటొకటి పొదలెడి చోటొకటి
యెట్టని నమ్మవచ్చు నిదియేటిదయ్యా
 
వేదాంతనిలయా వివిధాచరణ  
ఆదిదేవా శ్రీవేంకటాచలేశ  
సోదించి తలచినచోట నీ వుందువట  
యేదెస నీ మహిమ యిదేటిదయ్యా

ముద్దు గారీ జూడరమ్మ మోహన


ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె
మద్దులు విరిచిన మా మాధవుడు

చల్ల లమ్మ నేరిచినజాణ గొల్లెతల కెల్ల
వల్లెతాడు మా చిన్న వాసుదేవుడు
మొల్లపు గోపికల మోవిపండులకు నెల్ల
కొల్లకాడు గదమ్మ మా గోల గోవిందుడు


మందడిసానుల కమ్మని మోముదమ్ములకు
చెందినతుమ్మిదవో మా శ్రీకృష్ణుడు
చంద మైన దొడ్డీవారి సతులవయసులకు
విందువంటివా డమ్మ మా విఠ్ఠలుడు


హత్తిన రేపల్లెలోని అంగనామణుల కెల్ల
పొత్తుల సూత్రము మా బుద్ధుల హరి
మత్తిలి వ్రేతెల నిండుమనసుల కెల్లాను
చిత్తజునివంటి వాడు శ్రీ వేంకటేశుడు


అయ్యో యేమరి నే నాఁడాప్పుడేమై వుంటినో


అయ్యో యేమరి నే నాఁడాప్పుడేమై వుంటినో
అయ్యడ నీ దాసి నైతే ఆడరింతుగా


అల్లనాడు బాలుడవై ఆవులగాచేవేళ
చిల్లర దూడనైతే చేరి కాతువుగా
వల్లెగా విటుడవై రేపల్లె లో నుండే నాడు
గొల్లెత నయిన నన్ను కూడుకొందువుగా


మేలిమి రామావతారవేళ రాయి రప్ప నైనా
కాలు మోపి బదికించి కాతువుగా
వాలి సుగ్రీవుల వద్ద వానరమై వుండినాను
యేలి నన్ను పనిగొని యీడేర్తువుగా


వారిధిలో మచ్చ కూర్మావతారములైన నాడు
నీరులో జంతువునైనా నీవు గాతువుగా
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
మోరతోపున నిన్నాళ్ళు మోసపోతిగా

ఇందులోన గల సుఖము ఇంతే చాలు


ఇందులోన గల సుఖము ఇంతే చాలు మాకు
ఇందు వెలియైన సిరులేమియూ నొల్లము ||


ఆది దేవునచ్యుతు సర్వాంతరాత్ముకుని
వేదవేద్యు కమలాక్షు విశ్వపూర్ణుని |
శ్రీదేవు హరిని ఆశ్రిత పారిజాతుని
అదిగొని శరణంటిమి అన్యము మేమొల్లము ||


పరమాత్ము పరిపూర్ణు భవ రోగవైద్యుని
మురహరు గోవిందుని ముకుందుని |
హరి పుండరీకాక్షు అనంతుని అభవుని
పరగ నుతించితిమి పరులనేమొల్లము ||


అనుపమ గుణ దేహుని అణురేణు పరిపూర్ణు
ఘనుని చిరంతనుని కలిభంజనుని |
దనుజాంతకుని సర్వ ధరు శ్రీవేంకటపతిని
కని కొలిచితిమి యేగతులు నేమొల్లము ||

ఇహపరములకును ఏలికవు


ప|| ఇహపరములకును ఏలికవు | బహురూపంబుల ప్రహ్లాదవరదుడు ||

చ|| వేయికరంబుల వివిధాయుధంబుల | దాయల నడచిన దైవమవు |
నీయందున్నవి నిఖిల జగంబులు | పాయక మమ్మేలు ప్రహ్లాదవరద ||

చ|| కదిమి దుష్టులను గతము చేసితివి | త్రిదశుల గాచిన దేవుడవు |
వదల కిందరికి వరములొసంగగ | బ్రతికితి మిదివో ప్రహ్లాదవరద ||

చ|| శ్రీవల్లభుడవు చిత్తజగురుడవు | కావలసినచో కలుగుదువు |
శ్రీవేంకటాద్రిని శ్రీ అహోబలాన | భావింతు నీమూర్తి ప్రహ్లద వరద |

శ్రావణ బహుళాష్టమి సవరేత్రికాడను


శ్రావణ బహుళాష్టమి సవరేత్రికాడను
శ్రీవిభుడుదయించె చెలులాల వినరే


అసురుల శిక్షించ నమరుల రక్షించ
వసుధ భారమెల్ల నివారింపను
వసుదేవికిని దేవకిదేవికిని
అసదృశమగు కృష్ణుడవతారమందెను


గోపికల మన్నించ గొల్లలనెల్లఁ గావగ
దాపై మునులనెల్ల దయసేయను
దీపించ నందునుకి దేవియైన యశోదకు
యేపున సుతుడై కృష్ణుడిన్నిటఁ బెరిగెను


పాండవుల మనుపగ పదారువేల పెండ్లాడగ
నిండి శ్రీవేంకటాద్రి పై నిలుచుండగా
అండ నలమేల్మంగ నక్కునఁ గాగలించగ
దండియై యుండ కృష్ణుడు తగ నుతికెక్కెను