Showing posts with label ద D. Show all posts
Showing posts with label ద D. Show all posts

Thursday, June 12, 2014

దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో ఉబ్బు నీటిపై నొక హంస


దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో  
ఉబ్బు నీటిపై నొక హంస


అనువున గమల విహారమె నెలవై  

ఒనరియున్న దిదె ఒక హంస
మనియెడి జీవుల మానస సరసుల  

వునికి నున్న దిదె ఒక హంస


పాలు నీరు నేర్పరచి పాలలో  

నోలలాడె నిదె యొక హంస
పాలుపడిన యీ పరమహంసముల  

ఓలి నున్న దిదె యొక హంస


తడవి రోమరంధ్రంబుల గ్రుడ్ల  

నుడుగక పొదిగీ నొక హంస
కడు వేడుక వేంకటగిరి మీదట  

నొడలు పెంచెనిదె యొక హంస

దృష్టితాకు మాఅయ్యకు తెరవేయరే


దృష్టితాకు మాఅయ్యకు తెరవేయరే
దృష్టించెదరెవరైనా దరిచేరనీయకురే


చప్పుడు సేయుటకవసరము కాదనరే
అప్పుడు మజ్జనము ఆడుననీ తెలుపరే
కప్పురంపు సురటుల కొలిచెదరనరే
అప్పుడు సతుల తోనూ ఆరగించినాడనరే


దంతపు చవికెలో ఏకాంతమాదేననరే
అంతరంగమున నృత్యము ఆడెదరని తెలుపరే
దొంతి పూలతోటలోన తమిగూడి యున్నాడనరే
చెంత కేళాకూళి లోన చిత్తగించి యున్నాడనరే




పట్టంపు రాణియు తాను పవ్వళించియున్నాడనరే
రట్టుసేయనిందెవరైనా రానీయకురే
పట్టపు అలమేలుమంగపతి శ్రీవేంకటేశ్వరుడు
సృష్టిలోకకర్త గాన సేవించి పొమ్మనరే

దేవ యీ తగవు దీర్చవయ్యా


దేవ యీ తగవు దీర్చవయ్యా 
వేవేలకు నిది విన్నపమయ్యా


తనువున బొడమినతతి నింద్రియములు 
పొనిగి యెక్కడికి బోవునయా
పెనగి తల్లికడ బిడ్డలు భువిలో 
యెనగొని యెక్కడి కేగుదురయ్యా


పొడుగుచు మనమున బొడమిన యాసలు 
అదన నెక్కడికి నరుగునయా
వొదుగుచు జలములనుండు మత్స్యములు 
పదపడి యేగతి బాసీనయ్యా


లలి నొకటొకటికి లంకెలు నివే 
అలరుచు నేమని యందునయా
బలు శ్రీవేంకటపతి నాయాత్మను 
గలిగితి వెక్కడి కలుషములయ్యా

దేవదేవోత్తమ తే నమో నమో


దేవదేవోత్తమ తే నమో నమో
రావణదమన శ్రీరఘురామ


రవికులాంబుధిసోమ రామలక్ష్మణాగ్రజ
భువి భరత శతృఘ్న పూర్వజ
సవన పాలక కౌసల్యానంద వర్ధన
ధవళాబ్జనయన సీతారమణా


దనుజ సంహారక దశరథ నందన
జనక భూపాలక జామాత
వినమిత సుగ్రీవ విభీషణ సమేత
మునిజన వినుత సుముఖ చరిత్ర


అనిలజ వరద అహల్యశాప మోచన
సనకాది సేవిత చరణాంబుజ
ఘనతర వేంకట శ్రీగిరి నివాస
అనుపమోదార విహార గంభీర

దేవ వాసుదేవ భావయ తాం పాలయ


దేవ వాసుదేవ
భావయ తాం పాలయ


నరహరే అహో నారాయణరే
మురహర నగధర ముకుంద
తరుణీయం తు తవ విరహేణ
భరితవిచిత్రప్రతిమా జాతా


దివిజవందిత దేవోత్తమ అహో
నవనీతప్రియ నందసుత
తవ సంగమసంతతకామనయా
యువతి ర్జాతా యోగిణీవ


జిత(తి)దానవ అహో శ్రీవేంకటపతే
సతత మాధవ కృష్ణ సర్వేశ
రతిసంగమేన రమణీ యంతు
బతతే విహితాభరణా జాతా

దేవదుందుభులతోడ తేటతెల్లమైనాడు


దేవదుందుభులతోడ తేటతెల్లమైనాడు
సేవించరో ఇదే వీడే సింగారదేవుడు


బంగారుమేడలలోన పన్నీటమజ్జనమాడి
అంగము తడి యొత్తగా అదే దేవుడూ
ముంగిట( బులుకడిగిన ముత్యమువలె నున్నాడు
కుంగని రాజసముతో కొండవంటి దేవుదూ


కాంతులుమించిన మాణికపు తోరణముకింద
అంతటా కప్పురము చాతుకదే దేవుడు
పొంతల నమృతమే పోగైనట్టున్నవాడు
సంతతము సంపదల సరిలేని దేవుడు


తట్టుపుణుగు నించుక దండిసొమ్ములెల్లాబెట్టి
అట్టేలమేల్మంగ నరుత(గట్టి
నెట్టన నమ్మినవారికి ధానమైనున్నవాడు
పట్టపు శ్రీవేంకటాద్రి పతియైన దేవుడు

దీనరక్షకుడఖిలవినుతుడు దేవ దేవుడు రాముడు


దీనరక్షకుడఖిలవినుతుడు దేవ దేవుడు రాముడు
జానకీపతి కొలువుడీ ఘన సమర విజయుడు రాముడు


హరుని తారక బ్రహ్మమంత్రమై యమరినయర్థము రాముడు
సురలగాచి యసురుల నడచిన సూర్యకులజుడు రాముడు
సరయువం(నం)దును ముక్తి చూరలు జనుల కొసగెను రాముడు
హరియె యాతడు హరి విరించుల కాదిపురుషుడు రాముడు


మునులరుషులకు నభయ మొసగిన మూలమూరితి రాముడు
మనసులోపల పరమయోగులు మరుగు తేజము రాముడు
పనిచి మీదటి బ్రహ్మ పట్టము బంటు కొసగెను రాముడు
మనుజవేషముతోడ నగజకు మంత్రమాయను రాముడు


బలిమి మించిన దైవికముతో భక్త సులభుడు రాముడు
నిలిచి తనసరిలేని వేలుపు నిగమవంద్యుడు రాముడు
మెలుపు శ్రీ వేంకటగిరీంద్రముమీది దేవుడు రాముడు
వెలసె వావిలిపాటిలోపలి వీర విజయుడు రాముడు

దేహినిత్యుడు దేహము లనిత్యాలు


దేహినిత్యుడు దేహము లనిత్యాలు
యిహల నా మనసా యిది మరువకుమీ


గిది బాతచీరమాని కొత్త చీరగట్టినట్టు
ముదిమేను మాని దేహముమొగి గొత్తమేను మోచు
అదన జంపగలేవు ఆయుధము లితని
గదసి యగ్నియు నీరు గాలి జంపగ లేవు


ఈతడు నరకు వడ డీతడగ్ని గాలడు
యీతడు నీటమునుగ డీతడు గాలిబోడు
చేతనుడై సర్వగతుండౌ చెలియించ డేమిటను
యీతల ననాది యీ తడిరవు గదలడు


చేరికాని రాని వాడు చింతించరాని వాడు
భారపువికారాల బాసిన వాడీ యాత్మ
అరయు శ్రీవేంకటేశు ఆధీన మీతడని
సారము తెలియుటే సత్యం జ్ఞానం

దైవంబవు కర్తవు నీవే హరి


దైవంబవు కర్తవు నీవే హరి
యీవల నావల నెవ్వడనయ్యా


తలచిన తలపులు దైవ యోగములు
కలిగిన చేతలు కర్మములు
వెలసిన దేహము విషయాధీనము
యిల నౌకాదన నెవ్వడనయ్యా


జిగి నింద్రియములు చిత్తపు మూలము
తగులమి మాయకు తను గుణము
జగతి ప్రాణములు సంసార బంధము
యెగదిగ నాడగ యెవ్వడనయ్యా


శ్రీ తరుణేశ్వర శ్రీవేంకటపతి
ఆతుమ యిది నీ అధీనము
యీతల నీవిక నెట్టైన జేయుము
యేతలపోతకు నెవ్వడనయ్యా

దేవదేవోత్తమ నాకుదిక్కు నీవే యెపుడును


దేవదేవోత్తమ నాకుదిక్కు నీవే యెపుడును
యేవివరము తెలియ నేమిసేతునయ్యా


పాపముడిగినగాని ఫలియించదు పుణ్యము
కోపముమానినగాని కూడదు శాంతి
చాపల మడచక నిశ్చలబుద్ధి గలుగదు
యేపున నా వసము గా దేమి సేతునయ్యా


ఆసవిడిచిన గాని యంకెకురాదు విరతి
రోసినగాని సుజ్ఞానరుచి పుట్టదు
వేసాలు దొలగించక వివేకా లెల్లా మెచ్చరు
యీసుద్దు లేమియు నేర నేమి సేతు నయ్యా


కల్లలాడకున్నగాని కడతేరదు సత్యము
వొల్ల నన్నగాని సుఖ మొనగూడదు
యిల్లిదె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
యెల్లకాల మీమేలున కేమి సేతు నయ్యా

దిక్కునీవే జీవులకు దేవ సింహమా


దిక్కునీవే జీవులకు దేవ సింహమా
తెక్కుల గద్దియమీది దేవసింహమా


సురలెల్లా గొలువగ సూర్యచంద్రులకన్నుల
తిరమైన మహిమల దేవసింహమా
నిరతి ప్రహ్లాదుడు నీయెదుట నిలిచితే
తెరదీసితి మాయకు దేవసింహమా


భుజములుప్పొంగగాను పూచిన శంఖుచక్రాల
త్రిజగములు నేలేటి దేవసింహమా
గజభజింపుచు వచ్చి కాచుక నుతించేటి
ద్విజముని సంఘముల దేవసింహమా


ముప్పిరి దాసులకెల్లా ముందు ముందే యొసగేటి
తిప్పరాని వరముల దేవసింహమా
చిప్పల నహోబలాన శ్రీవెంకటాద్రి మీద
తెప్పల దేలేటి యట్టి దేవసింహమా

దైవమా నీ చేతిదే మాధర్మపుణ్యము


దైవమా నీ చేతిదే మాధర్మపుణ్యము
పూవు వంటి కడు లేత బుధ్ధి వారము


యేమిటి వారము నేము యిదివో మా కర్మ మెంత
భూమి నీవు పుట్టించగఁ బుట్టితిమి
నేమముతో నడచేటి నేరుపేది మావల్ల
దీముతో మోచిన తోలు దేహులము


యెక్కడ మాకిక గతి యెరిగే దెన్నడు నేము
చిక్కినట్టి నీ చేతిలో జీవులము
తక్కక నీ మాయలెల్లాఁ దాటగలమా మేము
మొక్కలపుటజ్ఞానపు ముగ్ధలము


యేది తుద మొదలు మాకిక నిందులో నీవే
ఆదిమూర్తి నీకు శరణాగతులము
యీదెస శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నీదయ గలుగగాను నీ వారము

దేవదేవుడెక్కినదె దివ్యరథము


దేవదేవుడెక్కినదె దివ్యరథము
మావంటివారికెల్ల మనోరథము


జలధి బాలులకై జలధులు వేరఁజేసి
పగటునఁ దోలెనదె పైడిరథము
మిగులగ కోపగించి మెరయురావణుమీద
తెగియెక్కి తోలెనదె దేవేంద్ర రథము


దిక్కులు సాధించి సీతాదేవితో నయోధ్యకు
పక్కన మరలిచె పుష్పకరథము
నిక్కు నరకాసురుపై నింగిమోవ నెక్కి తోలె
వెక్కసపు రెక్కలతో విష్ణు రథము


బలిమి రుఖ్మిణి దెచ్చి పరులగెల్చి యెక్కె
అలయేగుబెండ్లి కల్యాణరథము
యెలమి శ్రీవేంకటాద్రి నలమేలుమంగ గూడి
కలకాలమును నేగె ఘనమైన రథము

దేవ నీ పక్షపాతమో తిరిగే లోకుల వెల్తో


దేవ నీ పక్షపాతమో తిరిగే లోకుల వెల్తో
శ్రీవిభుడ నీవేకాదా చిత్తములోనయ్యా


దివములు సరియే దినరాత్రులును సరే
యివల సుఖదుఃఖాలు హెచ్చుకుందులేలయ్యా
భవములు సరియే ప్రాణములు సరియే
భువి పుణ్యపాపముల భోగము వేరేలయ్యా


విని కిందిరి కొకటే విషయాలు నొకరీతే
మునిగేటిజాతిబేధము లివేలయ్యా
అనయముఁ జూపొక్కటే ఆకలియు నొకటే
పెనగేటి గుణములు పెక్కుజాడ లేలయ్యా


అంతరాత్మ నీవొక్కడ వన్నిటా శ్రీవేంకటేశ
చింతలు వేవేలైన సిలుగేలయ్యా
యింతసేసీ నీమాయ లిందుకే నీశరణంటే
కాంతుడ నన్నిందుకే కాచితివి నేడయ్యా

దేవుడవు నీవు దేవుల నేను


దేవుడవు నీవు దేవుల నేను
వావులు గూడగాను వడి సేస వెట్టితి


వలపులు నే నెఱగ వాసులెఱగను - నీవు
కలకల నవ్వితేనే కరగితిని
పలుకులు నే నేర భావించగ నే నేర
పిలిచి విడెమిచ్చితే ప్రియమందితిని


మనసు సాధించనోప మర్మము లడుగనోప
చెనకి గోర నూదితే చేకొంటిని
పెనగజాలను నేను బిగియగ జాలను
కనువిచ్చి చూచితేనే కానిమ్మంటిని


పచ్చిచేతలు రచించ బలుమారు సిగ్గువడ
మచ్చిక గాగిలించితే మరిగితిని
యిచ్చట శ్రీవెంకటేశ యేలుకొంటి విటు నన్ను
మెచ్చి కాగిలించితేను మేకొని మొక్కితిని