Showing posts with label చ C. Show all posts
Showing posts with label చ C. Show all posts

Thursday, June 12, 2014

చేరి కొల్వరో ఈతడు శ్రీదేవుడు


చేరి కొల్వరో ఈతడు శ్రీదేవుడు
యీ రీతి శ్రీ వేంకటాద్రి నిరవైన దేవుడు


అలమేలుమంగ నురమందిడు కొన్న దేవుడు
చెలగి శంఖ చక్రాల చేతి దేవుడు
కల వరద హస్తము గటి హస్తపు దేవుడు
మలసీ శ్రీవత్స వనమాలికల దేవుడు


ఘన మకర కుణ్డల కర్ణముల దేవుడు
కనక పీతాంబర శౄంగార దేవుడు
ననిచి బ్రహ్మాదుల నాభి గన్న దేవుడు
జనించె బాదాల గంగ సంగతైన దేవుడు


కోటి మన్మథాకార సంకులమైన దేవుడు
జూటుపు కిరీటపు మించుల దేవుడు
వాటపు సొమ్ముల తోడి వసుధాపతి దేవుడు
యీటులేని శ్రీ వేంకటేశుడైన దేవుడు

చిత్తగించుమిదె చెలియ వికాసము


చిత్తగించుమిదె చెలియ వికాసము
పొత్తులు గలపీ భోగంబులకు


వెన్నెలరేకులు వెదచల్లీనిదె
సన్నల సెలవుల సకియా
కన్నులమొక్కులు కానుకలొసగీ
నిన్నుజూచి యిదె నివ్వెరగులను


జక్కవపిట్టల సంతము సేసీ
అక్కున గప్పుచు నతివా
చక్కని మోవిని చవులటు గొలిపీ
నెక్కొని నీపై నేస్తంబులను


పలుకుతేనియలు పలుమరుజిలికీ
మెలుపురతుల నలమేల్మంగ
యెలమిని శ్రీవేంకటేశ గూడితివి
అలరీ నీతో నదె సరసములా

చెప్పరాని మహిమల శ్రీదేవుడితడు


చెప్పరాని మహిమల శ్రీదేవుడితడు
కప్పి కన్నులపండుగగా చూడరో

అద్దుచు కప్పురధూళి యట్టె మేననలదగా
వొద్దిక దేవునిభావమూహించితేను
మద్దులు విరిచినట్టి మంచి బాలకృష్ణునికి
మద్దులకాంతి మేన మలసినటుండె

అమర తట్టుపుణుంగు అవధరించగాను
తమితో పోలికలెల్లా దచ్చిచూడాగా
యమునా నది నాగేట నండకు తీసుకొనగా
యమునానది నలుపు యంటినట్టుండె

అంగముల శ్రీవేంకటాధిపున కింతటాను
సింగారించి సొమ్ములెల్లా చెలరేగగా
బంగారు పుటలమేలుమంగ నురాన నుంచగా
బంగారము మేననెల్లా బరగినట్టుండె

చిత్తగించు మా మాటలు శ్రీ నరసింహా


చిత్తగించు మా మాటలు శ్రీ నరసింహా
చిత్తజ జనక వో శ్రీనరసింహా


చెలరేగి వున్నాడవు శ్రీనరసింహా - నీకు
జెలులెల్లా మొక్కేరు శ్రీనరసింహా
సెలవుల నవ్వేవిట్టే శ్రీనరసింహా - నీకే
సెలవు మావలపులు శ్రీనరసింహా


చిందీని మై చెమటలు శ్రీనరసింహా - నిన్ను
జెందినది కడు జాణ శ్రీనరసింహా
చెందమ్మి రేకుల గోళ్ళ శ్రీనరసింహా - నీపై
చిందులెల్లా పాడేము శ్రీనరసింహా


సిరినెరకాగిటి శ్రీనరసింహా - మంచి
సిరుల నహోబలము శ్రీనరసింహా
శిరసెత్తు శ్రీవేంకట శ్రీనరసింహా
చెరలాటాలికనేల శ్రీనరసింహా

చూడవమ్మ యశోదమ్మ వాడ వాడల వరదలివిగో


చూడవమ్మ యశోదమ్మ వాడ వాడల వరదలివిగో

పొంచి పులివాలు పెరుగు మించు మించు మీగడలు
వంచి వారలు వట్టిన కంచపుటుట్ల కాగులివో

పేరీ బేరని నేతులు చూరల వెన్నల జున్నులును
ఆరగించి యట నగుబాళ్ళు పార వేసిన బానలివిగో

తెల్లని కను దీగల సోగల చల్ల లమ్మేటి జవ్వనుల
చెల్లినట్లనె శ్రీ వేంకటపతి కొల్లలాడిన గురుతు లివిగో

చూడుడిందరికి సులభుడు హరి


చూడుడిందరికి సులభుడు హరి
తోడు నీడయగు దొరముని యితడు


కైవల్యమునకు కనకపు తాపల-
త్రోవై శ్రుతులకు తుదిపదమై
పావన మొకరూపంబై విరజకు
నావై నున్నాడిదె యితడు


కాపాడగ లోకములకు సుజ్ఞాన
దీపమై జగతికి తేజమై
పాపాలడపగ భవపయోధులకు
తేపై యున్నాడిదే యితడు


కరుణానిధి రంగపతికి కాంచీ-
వరునకు వేంకటగిరిపతికి
నిరతి నహోబలనృకేసరికి త-
త్పరుడగు శఠగోపముని యితడూ

చూడవమ్మ కృష్ణుడు నీసుతుడోయమ్మ


చూడవమ్మ కృష్ణుడు నీసుతుడోయమ్మ
ఆడీ వీధులవేంట యశోదమ్మ

కోలలు చాచి వుట్లు గొట్టగా పాలుపెరుగు
కాలువలు గట్టి పారెగదవమ్మా
మేలములాడీ వద్దంటే మిక్కిలి గొల్లెతలతో
ఆలకించి వినవమ్మ యశోదమ్మ

చక్కిలాలకుండలెల్లా చలాన దొండ్లు వొడిచి
దిక్కన దోటికోలల దీసీనమ్మా
చిక్కని తేనె చాడె చివ్వన రాత వేసితే
అక్కడ జోరున గారె యశోదమ్మా

అల్లంతనుండి తనకందరాని తెంకాయలు
వల్లెతాళ్ళు వేసి వంచీనమ్మా
బల్లిదుడలమేల్మంగపతి శ్రీవేంకటేశుడు
అల్లిబిల్లై యున్నాడమ్మ యశోదమ్మ

చెలి నీవు మొదలనే సిగ్గరి పెండ్లి కూతురవు


చెలి నీవు మొదలనే సిగ్గరి పెండ్లి కూతురవు
ఇలనింత పచ్చిదీరె(దేరీ?) ఇదివో నీ భావము


చెక్కులవెంటా గారె చెమట తుడుచుకోవే
చక్కవెట్టుకొనవే నీ జారిన కొప్పు
అక్కుమీద పెనగొన్న హారాలు చిక్కు దీయవే
ఇక్కువల నీ కోరికె లీడేరెనిపుడు


పెదవి మీద కెంపులబేంట్లు రాలుచుకోవే
చెదరిన ముంగురులు చేత దువ్వవే
వదలిన పయ్యెద చివ్వన బిగించుకొనవే
పది(బదిగా నీనోము ఫలియించె నిపుడు


తిలకము కరగెను దిద్దుకోవే నొసలను
కలసిన గురుతులు గప్పుకొనవే
యెలమి శ్రీవేంకటేశు( డేలె నలమేలుమంగవు
తలచిన తలపులు తలకూడె నిపుడు

చలి గాలి వేడేల చల్లీనే కప్పురపు


చలి గాలి వేడేల చల్లీనే కప్పురపు
మలయజము తానేల మండీనే

పాపంపు మననేల పారీనే నలుగడల
చూపేల నలువంక జూచీనే
తాపంపు మేనేల తడవీనే పూవింటి
తూపేల చిత్తంబు దూరీనే

వాయెత్తి చిలుకేల వదరీనె పలుమారు
కోయిలలు దామేల గొణిగీనే
రాయడికి నలులేల రసీనే మాతోను
కాయజుడు తానేల కసరీనే

ఏకాంతమునేల యెదురైతినే తనకు
లోకాధి పతికేల లోనైతినే
చేకొనిదే మన్నించె శేషాద్రి వల్లభుడు
పైకొనిదె మమ్మేల పాలించెనే

చల్లని చూపులవాని చక్కనివాని


చల్లని చూపులవాని చక్కనివాని | పీలి |
చొల్లెపుఁ జుట్లవానిఁ జూపరమ్మ చెలులు


వాడలోని చెలులను వలపించి వచ్చెనే | వాడు |
చేడెల మనసు దొంగ చిన్నికృష్ణుడు
యేడుగడయునుఁ దానై యెలయించె నన్నును |వానిఁ|
జూడక వుండగ లేను చూపరమ్మ చెలులు


మందలోని గొల్లెతల మరగించి వచ్చెనే | వాడు |
సందడిపెండ్లికొడుకు జాణకృష్ణుడు
ముందు వెనకా నలమి మొహింపించె నన్నును | వాని|
పొందులు మానగ లేను పోనీకురే చెలు(లు?)


ఇంటింటి యింతుల నెల్లా యెలయించి వచ్చెనే | వాడు|
దంటవాడు కవి(లి?) కిఁచేతలకృష్ణుడు
నంటునను శ్రీవెంకటనాథుఁడై నన్నుఁ గూడెనే | వాని |
వొంటిఁ బాయలే నావద్ద నుంచరమ్మ చెలులు.

చదివితి దొల్లి కొంత చదివేనింకా గొంత


చదివితి దొల్లి కొంత చదివేనింకా గొంత
యెదిరి నన్నెఱగను యెంతైన నయ్యో

వొరుల దూషింతుగాని వొకమారైన నా
దురిత కర్మములను దూషించను
పరుల నవ్వుదుగాని పలుయోనికూపముల
నరకపు నా మేను నవ్వుకోను

లోకుల గోపింతు గాని లోని కామాదులనేటి
కాకరి శత్రువుల మీద కడు కోపించ
ఆకడ బుద్దులు చెప్పి అన్యుల బోధింతుగాని
తేకువ నాలోని హరి దెలుసుకోలేను

యితరుల దుర్గుణము లెంచి,యెంచి రోతుగాని
మతిలో నాయాసలు మానలేను
గతిగా శ్రీవేంకటేశుగని బ్రతికిగాని
తతి నిన్నాళ్ళ దాకా దలపోయలేను

చూడవయ్య నీసుదతి విలాసము


చూడవయ్య నీసుదతి విలాసము
వేడుకకాడవు విభుడవు నీవు


పున్నమివెన్నెల పోగులు వోసి
సన్నపు నవ్వుల జవరాలు
వన్నెల కుంకుమ వసంత మాడే
ఇన్నిటా కళలతో ఈ మెరుగుబోడి


పాటించి తుమ్మెద పౌజులు దీర్చీ
కాటుక కన్నుల కలికి యిదే
సూటి జక్కవల జోడలరించీ
నాటకపు గతుల నాభి సరసి


అంగజురథమున హంసలు నిలిపి
కంగులేని ఘన గజగమన
ఇంగితపు శ్రీవేంకటేశ నిన్నెనసె
పంగెన సురతపు పల్లవాధరి

చూచి వచ్చితి నీవున్నచోటికి తోడి తెచ్చితి


చూచి వచ్చితి నీవున్నచోటికి తోడి తెచ్చితి
చేచేతఁ బెండ్లాడు చిత్తగించవయ్యా


లలితాంగి జవరాలు లావణ్యవతి ఈకె
కలువకంఠి మంచి కంబుకంఠి
జలజవదన చక్రజఘన సింహమధ్య
తలిరుఁబోడిచక్కదనమిట్టిదయ్యా


అలివేణి మిగులనీలాలక శశిభాల
మలయజగంధి మహామానిని యీకె
పెలుచుమరునివిండ్లబొమ్మలది చారుబింబోష్ఠి
కని(లి?)తకుందరద చక్కందనమిట్టిదయ్యా


చెక్కుటద్దములది శ్రీకారకన్న(ర్ణ?)ములది
నిక్కుఁజన్నులరంభోరు నిర్మలపాద
గక్కన శ్రీవేంకటేశ కదిసె లతాహస్త
దక్కె నీకీ లేమ చక్కందన మిట్టిదయ్యా

చిత్తజగురుడ వో శ్రీనరసింహా


చిత్తజగురుడ వో శ్రీనరసింహా
బత్తిసేసేరు మునులు పరికించవయ్యా


సకలదేవతలును జయవెట్టుచున్నారు
చకితులై దానవులు సమసిరదె
అకలంకయగు లక్ష్మియటు నీ తొడపై నెక్కె
ప్రకటమైన నీ కోపము మానవయ్యా


తుంబురునారదాదులు దొరకొని పాడేరు
అంబుజాసనుడభయమడిగీనదె
అంబరవీధి నాడేరు యచ్చరలందరుగూడి
శంబరరిపుజనక శాంతము చూపవయ్యా


హత్తి కొలిచేరదె యక్షులును గంధర్వులు
చిత్తగించు పొగడేరు సిద్ధసాధ్యులు
సత్తుగా నీ దాసులము శరణు చొచ్చితి మిదె
యిత్తల శ్రీవేంకటేశ యేలుకొనవయ్యా

చిన్నవాడు నాలుగుచేతులతోనున్నాడు


చిన్నవాడు నాలుగుచేతులతోనున్నాడు
కన్నప్పుడే శంఖముచక్రముచేతనున్నది


నడురెయి రోహిణి నక్షత్రమునబుట్టె
వడి కృష్ణుడిదివో దేవతలందు
పడిన మీ బాధలెల్ల ప్రజలాల యిప్పుడిట్టె
విడుగరాయ మీరు వెరవకుడికను


పుట్టుతనె బాలుడు అబ్బురమైన మాటలెల్ల
అట్టె వసుదేవుని కానతిచ్చెను
వట్టిజాలింకేల దేవతలాల మునులాల
వెట్టి వేములు మానెను వెరవకుడికను


శ్రీవేంకటనాథుడే యీసిసువు తానైనాడు
యీవల వరము లెల్లా నిచ్చుచును
కావగ దిక్కైనా డిక్కడనె వోదాసులల
వేవేగ వేడుకతోడ వెరవకుడికను

చదివి చదివి వట్టి జాలిబడుటింతే గాక


చదివి చదివి వట్టి జాలిబడుటింతే గాక
యెదుట నిన్ను గానగ నితరుల వశమా


ఆకాశముపొడవు ఆకాశమేయెరుగు
ఆకడ జలధిలోతు ఆ జలధే యెరుగు
శ్రీకాంతుడ నీఘనము చేరి నీవే యెరుగుదు
వీకడ నింతంతన నితరుల వశమా


నదుల యిసుకలెల్ల నదులే యెరుగును
కదిలి గాలియిరవు గాలికే తెలుసు
అదన నాత్మగుణము లంతరాత్మ నీవెరుగు -
దిదియదిననిచెప్ప నితరుల వశమా


శ్రీవేంకటేశ యిన్నిచింతలకు మొదలు
యీవల నీశరణంటే యిటు నీవే యెరిగింతు
దైవమా నీకల్పనలు తగనీవే యెరిగింతు
వీవల నౌగాదన నితరులవశమాక

చూడచిన్నదానవింతే సుద్దులు కోటానఁగోటి


చూడచిన్నదానవింతే సుద్దులు కోటానఁగోటి
యేడేడ నేరుచుకొంటివే వో కలికి


కిన్నెరమీటులలోని గిలిగింతలు , నీ
వన్నెల కనుచూపుల వలవంతలు
యెన్నరాని యిచ్చకపు టెలయింతలు
యెన్నడు నేరుచుకొంటివే వో కలికి



సారెకు నెడవాయని సరసములు , నీ
తారుకాణ సన్నల తమకములు
గారవించి బుజ్జగించే గమకములు
యేరీతి నేరుచుకొంటివే వో కలికి


కందువ శ్రీవేంకటేశు కలయికలు , నీ
యందమైన సమరతి యలయికలు
పొందుల మునుముంగిలి పొలయికలు
యెందెందు నేరుచుకొంటివే వో కలికి

చూడరమ్మ యిదె నేడు సుక్కురారము


చూడరమ్మ యిదె నేడు సుక్కురారము
వేడుక చక్కదనాలు వేవేలైనాడు


చప్పుడుతో పన్నీటి మజ్జనముతో నున్నవాడు
అప్పుడే ఆదినారాయాణునివలె
కప్పురకాపామీద కడుఁబూసుకున్నవాడు
ముప్పిరి బులుకడిగె ముత్యమువలె


పొసగెనప్పటి తట్టుపుణుగులందుకున్నాడు
కసుగందని కాలమేఘమువలెను
సుసగాన మేనునిండా సొమ్మువెట్టుకున్నాడు
పసల పద్దరువన్నె బంగారువలెను


అలమేల్మంగను యురమందు నిడుకొన్నవాడు
యెలమి సంపదలకు యిల్లువలెను
అలరుచు శ్రీవేంకటాద్రిమీదనున్నవాడు
కలబోసి చూడగా దొంతరకొండవలెను

చెప్పరాని మహిమల శ్రీధరా నీవు


చెప్పరాని మహిమల శ్రీధరా నీవు
చెప్పినట్టు చేసేము శ్రీధరా


చేర దీసి నా కన్నుల శ్రీధరా నీ
జీరల మేను చూచితి శ్రీధరా
చేరువ సంతోషమబ్బె శ్రీధరా
చీరుమూరాడెదమీ శ్రీధరా


చెల్లు నన్నియును నీకు శ్రీధరా నీ
చిల్లరసతులు వారే శ్రీధరా
చెల్లబో ఆ సుద్ది విని శ్రీధరా నాకు
చిల్లులాయె వీనులెల్లా శ్రీధరా


సేవలు సేసేము నీకు శ్రీధరా మమ్ము
జేవదేరగూడితివి శ్రీధరా
చేవల్లకు రావోయి శ్రీధరా
శ్రీవేంకటాద్రి మీది శ్రీధరా