Showing posts with label ఇ E. Show all posts
Showing posts with label ఇ E. Show all posts

Thursday, June 12, 2014

ఇందులోన గల సుఖము ఇంతే చాలు


ఇందులోన గల సుఖము ఇంతే చాలు మాకు
ఇందు వెలియైన సిరులేమియూ నొల్లము ||


ఆది దేవునచ్యుతు సర్వాంతరాత్ముకుని
వేదవేద్యు కమలాక్షు విశ్వపూర్ణుని |
శ్రీదేవు హరిని ఆశ్రిత పారిజాతుని
అదిగొని శరణంటిమి అన్యము మేమొల్లము ||


పరమాత్ము పరిపూర్ణు భవ రోగవైద్యుని
మురహరు గోవిందుని ముకుందుని |
హరి పుండరీకాక్షు అనంతుని అభవుని
పరగ నుతించితిమి పరులనేమొల్లము ||


అనుపమ గుణ దేహుని అణురేణు పరిపూర్ణు
ఘనుని చిరంతనుని కలిభంజనుని |
దనుజాంతకుని సర్వ ధరు శ్రీవేంకటపతిని
కని కొలిచితిమి యేగతులు నేమొల్లము ||

ఇహపరములకును ఏలికవు


ప|| ఇహపరములకును ఏలికవు | బహురూపంబుల ప్రహ్లాదవరదుడు ||

చ|| వేయికరంబుల వివిధాయుధంబుల | దాయల నడచిన దైవమవు |
నీయందున్నవి నిఖిల జగంబులు | పాయక మమ్మేలు ప్రహ్లాదవరద ||

చ|| కదిమి దుష్టులను గతము చేసితివి | త్రిదశుల గాచిన దేవుడవు |
వదల కిందరికి వరములొసంగగ | బ్రతికితి మిదివో ప్రహ్లాదవరద ||

చ|| శ్రీవల్లభుడవు చిత్తజగురుడవు | కావలసినచో కలుగుదువు |
శ్రీవేంకటాద్రిని శ్రీ అహోబలాన | భావింతు నీమూర్తి ప్రహ్లద వరద |